కల్యాణోత్సవాలకు నేడు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

కల్యాణోత్సవాలకు నేడు శ్రీకారం

Mar 4 2026 7:37 AM | Updated on Mar 4 2026 7:37 AM

గోటి తలంబ్రాలతో రామయ్య చెంతకు..

ఈ ఉదయం పెళ్లి కుమారుడిగా భద్రగిరి రామయ్య

పసుపు కొమ్ములు దంచే వేడుకతో పనులు షురూ..

ఆలయంలో నేడు వసంతోత్సవం, డోలోత్సవం

గోటి తలంబ్రాలతో భారీగా తరలివస్తున్న భక్తులు

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఈనెల 26, 27 తేదీల్లో జరిగే శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవాల పనులకు బుధవారం శ్రీకారం చుట్టనున్నారు. ఈ క్రమంలో రామయ్య నేడు పెళ్లి కుమారుడిగా మారనున్నాడు. పసుపు కొమ్ములు దంచి, తలంబ్రాల తయారీతో పనులు ప్రారంభిస్తారు. సాధారణంగా ఫాల్గుణ పౌర్ణమి రోజునే పనులు ప్రారంభించాల్సి ఉన్నా.. మంగళవారం చంద్రగ్రహణం కావడంతో బుధవారానికి మార్చారు. కాగా, నేడు స్వామివారికి వసంతోత్సవం, డోలోత్సవం తదితర పూజలు నిర్వహిస్తారు. తలంబ్రాల తయారీ వేడుకకు మిథిలా స్టేడియం ప్రాంగణంలోని వైకుంఠ ద్వారం వద్ద అధికారులు ఏర్పాట్లు చేయగా, వసంతోత్సవం, డోలోత్సవం బేడా మండపంలో జరుగనున్నాయి.

వెల్లివిరుస్తున్న ఆధ్యాత్మికత..

శ్రీ సీతారాముల కల్యాణానికి పసుపు కొమ్ములు దంచి, తలంబ్రాలు కలపడంతో పనులు ప్రారంభించడం సంప్రదాయం. ఈ కార్యక్రమంలో ఇటీవల భక్తులను భాగస్వాములను చేయడంతో భద్రగిరి క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. గతంలో ఆలయంలో పరిమిత సంఖ్యలో భక్తులతో ఈ వేడుకను చేపట్టగా, ప్రస్తుతం మిథిలా స్టేడియం ప్రాంగణంలోకి మార్చడంతో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ ఏడాది 300 క్వింటాళ్ల తలంబ్రాలను సిద్ధం చేయాలని అఽధికారులు భావిస్తున్నారు. పసుపు, కుంకుమ దంచి, ప్రత్యేక గులాములతో తలంబ్రాలు సిద్ధం చేయడం భద్రగిరిలో మాత్రమే ప్రత్యేకమైన వేడుక. ఈ సందర్భంగా బుధవారం నిత్యకల్యాణం రద్దు చేయగా గురువారం యథావిధిగా నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు. ఇక నేడు వసంతోత్సవం సందర్భంగా సహస్రధారతో స్నపనం, అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారిని ఊయలలో ఆశీనులు చేసి డోలోత్సవం నిర్వహిస్తారు. శ్రీ స్వర్ణ లక్ష్మీ అమ్మవారికి పంచామృత స్నపనం, సాయంత్రం 4 గంటలకు సామూహిక కుంకుమార్చన జరగనున్నాయి. కాగా, మేళతాళాలు, వేద మంత్రాల నడుమ అర్చకులు పవిత్ర గోదావరి నదీ జలాలు తీసుకొచ్చి మంగళవారం రాత్రి వసంతోత్సవానికి అంకురార్పణ చేశారు. అనంతరం యాగశాలలో వాస్తుహోమం నిర్వహించారు.

రామయ్య కల్యాణ తంతులో తలంబ్రాలు కీలకం. వీటి తయారీలో పరోక్షంగా భాగస్వాములయ్యేందుకు భక్తులు గత కొన్నేళ్లుగా గోటితో ఒలిచి బియ్యం సిద్ధం చేస్తున్నారు. నిష్టగా, కఠోర దీక్షతో శ్రీరామనామస్మరణ చేసుకుంటూ గోటితో ఒలుస్తున్నారు. వీటిని రామయ్య సన్నిధికి తీసుకొచ్చి భద్రగిరి ప్రదక్షిణ చేశాక స్వామివారి తలంబ్రాలలో కలుపుతారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు గ్రామాల్లో తయారు చేస్తున్న భక్తులు పాదయాత్రగా భద్రాచలం తరలివచ్చి సమర్పిస్తుండడం విశేషం. కోరుకొండకు చెందిన అప్పారావు బృందం గత రెండు దశాబ్దాలుగా ప్రత్యేక పూజలు నిర్వహించిన నారు వేసి, పంట కోశాక గోటితో తలంబ్రాలు తయారు చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement