శాస్త్రోక్తంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని కనుల పండువగా జరిపించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని ఆంజనేయస్వామి వారికిఅభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
యాప్‌తో యూరియా సరఫరా సులభం
డీఏఓ బాబూరావు
మణుగూరు రూరల్ : రైతులకు ఎరువులు, యూరియా సరఫరాను సులభతరం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వేల్పుల బాబూరావు తెలిపారు. మణుగూరు పీఏసీఎస్‌లో యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైతులకు మంగళవారం ఆయన యూరియా బస్తాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. క్యూలైన్లలో నిల్చునే ఇబ్బంది లేకుండా రైతులు ఇంటి నుంచే యూరియా, ఇతర ఎరువులను బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 24,500 మంది రైతులు 1.42 లక్షల యూరియా బస్తాలను యాప్ ద్వారా తీసుకున్నారని వివరించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ బి.తాతారావు, ఏఈఓ కొమరం లక్ష్మణరావు, సొసైటీ సీఈఓ సునీల్ తదితరులు పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా రామయ్య నిత్యకల్యాణం


