వసూళ్లు అంతంతే..
పట్టణాల్లో భారీగా పేరుకుపోయిన పన్నులు
మిగిలింది ఇంకా 33 రోజులే..
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియతో వెనుకబాటు
వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేస్తామంటున్న అధికారులు
కొత్తగూడెంఅర్బన్ : జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్‌తో పాటు అశ్వారావుపేట, ఇల్లెందు మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుల వసూళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఫిబ్రవరి ముగుస్తుండగా, ఈ ఆర్థిక సంవత్సరానికి ఇంకా నెల రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో మున్సిపల్ ఎన్నికల హడావిడితో సిబ్బంది పన్నుల వసూళ్లపై దృష్టి సారించలేదు. దీంతో బకాయిలు పేరుకుపోయాయి. ఇప్పటివరకు కొత్తగూడెం కార్పొరేషన్‌తో పాటు ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో సగానికి కొంత అటుఇటుగా మాత్రమే పన్నులు వసూలు కావడం గమనార్హం. మణుగూరు మున్సిపాలిటీకి సంబంధించి కోర్టులో కేసు ఉండడంతో ఎన్నికలు లేకపోవడంతో అక్కడ మాత్రం 75 శాతం మేర పన్నులు వసూలు చేయగలిగారు.
మొండి బకాయిలపై దృష్టేది..?
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ మొండి బకాయిల వసూళ్లపై అధికారులు దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. భారీగా పన్నులు పేరుకుపోయిన వారింటికి అధికారులు వెళ్లగానే రాజకీయ నాయకుల నుంచి ఫోన్లు రావడంతో వారేమీ చేయలేక వెనుదిరుగుతున్నారు. ఎవరి అండ లేని పేదలు మాత్రం రూ.1000 బకాయి ఉన్నా అధికారులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అలా కాకుండా బకాయి పడిన వారందరి నుంచీ వసూలు చేయాలని పలువురు అంటున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్‌లో అయితే రూ.30 వేలు, రూ.40 వేలు బకాయిలున్న వారి ఇంటి నంబర్లను తొలగిస్తున్న అధికారులు రూ.లక్షల్లో బకాయిలు పెండింగ్ ఉన్నవారి వైపు మాత్రం కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
పన్నుల డిమాండ్, వసూళ్లు ఇలా..
జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు సంబంధించి ఈ ఏడాది పన్నుల డిమాండ్ రూ.12కోట్లు ఉండగా, ఇప్పటి వరకు రూ.5.50 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. మిగిలిన బకాయిలు మార్చి నెలాఖరు నాటికి వసూలు చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అశ్వారావుపేటలో రూ.2.35 కోట్లు డిమాండ్ ఉండగా, ఇప్పటివరకు రూ.1.24 కోట్లు వసూలు కాగా, ఇంకా రూ.1.11 కోట్ల మేర బకాయిలున్నాయి. ఇల్లెందు మున్సిపాలిటీలో రూ.1.50 కోట్లకు గాను సుమారు రూ.75 లక్షలు వసూలు చేశారు. మణుగూరు మున్సిపాలిటీలో మాత్రం రూ.1.42 కోట్లకు రూ.1.05 లక్షలు వసూలయ్యాయి.
గత చర్యలు పునరావృతం అయ్యేనా..
మున్సిపాలిటీల్లో ఇంటి పన్నుల మొండి బకాయిలు వసూళ్లు చేసేందుకు అధికారులు గతంలో సామాన్లు జప్తు చేసేవారు. ఇటీవల కాలంలో అయితే ఇంటి పన్నులు చెల్లించాల్సిన యజమానుల పేర్లను వారి వీధుల్లో ప్రధాన సెంటర్లు, కార్యాలయాల వద్ద ప్రదర్శిస్తూ, పన్ను చెల్లించిన తరువాత వాటిని తొలగించే వారు. ప్రస్తుతం కూడా అలాంటి చర్యలు చేపడితేనే పన్నులు సక్రమంగా వసూలవుతాయని పలువురు సూచిస్తున్నారు. కాగా, మార్చి నెల మొత్తం పన్నుల వసూళ్ల పనిమీదే ఉంటామని, ఈ మేరకు సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు లక్ష్య సాధనకు చేరవవుతామని అంటున్నారు.


