ఇంటర్ పరీక్షలు ప్రారంభం
జిల్లాలో 37 సెంటర్లు ఏర్పాటు
పలు కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
కొత్తగూడెంఅర్బన్ : ఇంటర్మీడిఝెట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో 37 కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్ల నడుమ పరీక్షలు నిర్వహించగా విద్యార్థులు ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకున్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించడంతో పాటు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరానికి సంబంధించి జనరల్ విద్యార్థులు 7,973 మంది, ఒకేషనల్ విద్యార్ధులు 1,712 మంది ఉండగా తొలిరోజు పరీక్షకు జనరల్ విభాగంలో 7,683 మంది, ఒకేషనల్‌లో 1,527 మంది హాజరయ్యారు. రెండు విభాగాల్లో కలిపి 475 మంది గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడిఝెట్ నోడల్ అధికారి హెచ్.వెంకటేశ్వర్లు తెలిపారు. కాగా, పాల్వంచ ప్రభుత్వ జూనియర్ కళాశాల, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ తనిఖీ చేశారు. ప్రశ్నపత్రాల భద్రత, పంపిణీ విధానం, అభ్యర్థుల తనిఖీ ప్రక్రియ, ఇన్విజిలేషన్ వ్యవస్థ, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ తదితర అంశాలపై సమీక్షించిన ఆయన.. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించడం పట్ల సంతృపి్‌త్ వ్యక్తం చేశారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, భద్రత చర్యలు కల్పించామని ఆయన వివరించారు. పరీక్షల ముగిసేంత వరకు ఇలాగే పటిష్ట చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరై ఉత్తమ ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు.
ఇంటర్ పరీక్షలు ప్రారంభం


