భూదాన్ భూముల్లో ఉద్రిక్తత
ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు కూల్చివేత
పునరావాస కేంద్రాలకు
ప్రజల తరలింపు
వేయి మంది పోలీసులతో
భారీ బందోబస్తు
ఖమ్మంఅర్బన్: ఖమ్మం శివారు వెలుగుమట్ల రెవెన్యూ ప్రాంతంలోని భూదాన్ భూముల్లో మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెల్లవారుజాము నుండే అధికారులు భారీ పోలీసు బందోబస్త్ నడుమ జేసీబీలు, బుల్డోజర్లతో చేరుకుని సుమారు 400 ఇళ్లను కూల్చివేశారు. కలెక్టరేట్ సమీపాన పదేళ్లుగా నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించి సామగ్రితో పునరావాస కేంద్రాలకు తరలించారు.
ఉదయం ఐదు గంటలకే..
అధికారులు పెద్ద సంఖ్యలో జేసీబీలు, బుల్డోజర్లు, ట్రాక్టర్లతో పోలీసు బందోబస్తు నడుమ ఉదయం ఐదు గంటలకే భూదాన్ భూముల్లోని నివాసాల వద్దకు చేరుకున్నారు. ఈ మేరకు సామగ్రి సర్దుకుని ఇళ్లు ఖాళీ చేయాలంటూ మైక్‌ల ద్వారా సూచించారు. దీంతో స్థానికులు తేరుకుని కర్రలతో పోలీసులను, అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఎవరైనా అధికారుల చర్యలకు అడ్డుపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించడంతో వారంతా వెనక్కి తగ్గారు. అనంతరం 14 బృందాలుగా ఏర్పడిన అధికారులు నిర్మాణాల కూల్చివేత చేపట్టారు. ప్రతీ బృందాన్ని తహసీల్దార్ స్థాయి అధికారి పర్యవేక్షించగా, ఖమ్మం, భద్రాద్రి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల నుంచి వచ్చిన వేయి మందికి పైగా పోలీసు సిబ్బందితో పాటు రెవెన్యూ, కేఎంసీ కార్మికులు కూడా పాల్గొన్నారు. గంటల వ్యవధిలో సుమారు 400 ఇళ్లను నేలమట్టం చేయగా, కోర్టు ప్రత్యేక ఆదేశాలు ఉన్న పది ఇళ్లను మినహాయించినట్లు అధికారులు తెలిపారు. కూల్చివేతలను ఖమ్మం ఆర్డీవో నరసింహారావు పర్యవేక్షించగా, నగర ఏసీపీ రమణమూర్తి బందోబస్తులో పాల్గొన్నారు.
పునరావాసానికి తరలింపు
అధికారుల సూచనతో కొందరు స్వచ్ఛందంగా ఇళ్లు ఖాళీ చేయగా, మరికొందరిని అధికారులు వాహనాల్లో సామగ్రితో సహా ముందస్తుగా ఏర్పాటు చేసిన స్వర్ణభారతి కల్యాణ మండపంలోని పునరావాస కేంద్రానికి తరలించారు.
భూదాన్ యజ్ఞ బోర్డు ఆదేశాలతోనే తొలగింపు
ఖమ్మంసహకారనగర్: ఖమ్మం అర్బన్ మండలం భూదాన్ భూముల్లోని ఆక్రమణదారుల ఇళ్ల తొలగింపు ప్రక్రియను భూదాన్ యజ్ఞ బోర్డు ఆదేశాలతో చేపట్టినట్లు ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) పి.శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయా కుటుంబాలకు స్వర్ణభారతి కల్యాణమండపంలో ఆశ్రయం కల్పించడమే కాక సామగ్రిని అంబేద్కర్ భవనంలో భద్రపరచినట్లు తెలిపారు.
భూదాన్ భూముల్లో ఉద్రిక్తత


