దారి మళ్లారెందుకో..?
ఎవరి ఒత్తిడితో ఈ మార్పు..!
వనాలు కాపాడే విషయంలో రాజీ పడని అటవీ శాఖ
రోడ్లు, వంతెనలు, ప్రాజెక్టుల నిర్మాణాలకు ససేమిరా
‘మణుగూరు’లో మాత్రం తన వైఖరికి విరుద్ధంగా అడవి నరికివేత
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: అడవుల సంరక్షణ విషయంలో అటవీ శాఖ నిబంధనలు తు.చ. తప్పకుండా పాటిస్తుంది. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా కొన్ని కీలకమైన ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. అయినప్పటికీ అడవిని రక్షించడంలో రాజీ పడదనే పేరును ఆ శాఖ తెచ్చుకుంది.
ఆరేళ్లుగా అతీగతీ లేదు..
ఆళ్లపల్లి – మామకన్ను మధ్యన కిన్నెరసానిపై రూ.9 కోట్లతో 2019లో వంతెన పనులు ప్రారంభమయ్యాయి. అయితే వంతెనకు సంబంధించి ఒక పిల్లర్ అభయారణ్యం పరిధిలో ఉందంటూ అటవీ శాఖ ఆ పనులను ఆపేసింది. ఆరేళ్లు గడిచినా ఇప్పటికీ ఇంచు కూడా ముందుకు సాగలేదు. ఇలాంటి ఘటనలు జిల్లాలో అనేకం ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటైన కొత్తలో అశ్వాపురం మండలంలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు గతంలో ప్రయత్నాలు జరిగాయి. దీనికి అనువుగా పినపాక మండలం జానంపేటలో 50 ఎకరాల స్థలంలో ఆయిల్‌ఫామ్ మొక్కల నర్సరీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే, అటవీ శాఖ అభ్యంతరాలతో నర్సరీ దగ్గరే ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. చివరకు పామాయిల్ ఫ్యాక్టరీ సిద్దిపేటకు తరలిపోయింది. వీరాపురం క్రాస్‌రోడ్ నుంచి రేగళ్ల మీదుగా ఆళ్లపల్లి మండలం మర్కోడు వరకు గత ప్రభుత్వ హయాంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంత కోటాలో రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరయ్యాయి. అయితే రేగళ్ల – మర్కోడు మధ్య అటవీ ప్రాంతమనే అడ్డంకులతో ఈ రోడ్డు నిర్మాణం జరగక నిధులు వెనక్కి మళ్లాయి. ఈ రహదారి పూర్తయితే మణుగూరుతో సంబంధం లేకుండా జిల్లా కేంద్రం కొత్తగూడెం వచ్చేందుకు వారికి దగ్గరి దారి అందుబాటులోకి వచ్చేది. అత్యవసర వైద్యం, ఇతరత అవసరాలకు ఈ రోడ్డు ఏజెన్సీ వాసులకు ఉపయోగపడేది.
అటవీ సంరక్షణే ధ్యేయంగా..
అటవీ శాఖ అభ్యంతరాలతో జిల్లా వ్యాప్తంగా అనేక రోడ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు. అందులో మచ్చుకు కొన్ని ఇలా ఉన్నాయి.. పాల్వంచ మండలం మొండికట్ట – కారేగట్టు రోడ్డుకు మూడేళ్ల క్రితమే రూ.6 కోట్లు మంజూరయ్యాయి. అశ్వారావుపేట మండలంలో గాండ్లగూడెం – చెన్నాపురం రోడ్డు, ములకలపల్లి మండలం తిమ్మంపేట – గుండాలపాడు రోడ్డు, చండ్రుగొండ మండలంలో బెండాలపాడు –బ్రహ్మాళ్లకుంట, ఇల్లెందు మండలం మొండితోగు – ధర్మాపురం తదితర రోడ్లకు నిధులు మంజూరైనా అటవీశాఖ అభ్యంతరాలతో ఈ పనులన్నీ అర్ధంతరంగా ఆగిపోయాయి. ఇంకా పలు వంతెనలు, కల్వర్టుల పనులు కూడా నిలిచిపోయాయి.
వలసలపైనా కఠినమే
ఒంటి మీద సరైన వస్త్రం కూడా లేకుండా అత్యంత దీనమైన పరిస్థితుల్లో వలస ఆదివాసీలు జిల్లాలో జీవిస్తున్నారు. వాగు నీరే వీరికి ఆధారం. వేసవిలో వాగులు ఎండి గుక్కెడి నీటి కోసం అల్లాడిపోతుంటారు. వీరు నివసించే గ్రామాలకు రోడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించడంపై అటవీ శాఖ ఎప్పటి నుంచో అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చివరకు తాగునీటి కోసం బోరు వేసేందుకు కూడా ఒప్పుకోవడం లేదు.
వనాలను కాపాడే విషయంలో నిక్కచ్చిగా ఉన్న జిల్లా అటవీ విభాగం, మణుగూరు డివిజన్‌లో నిర్మించిన జలపాతాల రోడ్డుతో చిక్కుల్లో పడినట్టయింది. గోదావరి తీరంలో ఉన్న ఇసుక రీచ్‌ల నుంచి లారీలు వచ్చి పోయేందుకు వీలుగా అడవిలో వేలాది చెట్లను నరికి రోడ్డు వేయడం, తర్వాత దానికి వాటర్ ఫాల్స్ రోడ్లు అంటూ కలరింగ్ ఇవ్వడం అటవీ శాఖ పనితీరులో వచ్చిన మార్పునకు అద్దం పడుతోంది. అడవులను సంరక్షించే విషయంలో ఇప్పటి వరకు కఠినంగా ఉన్న జిల్లా అటవీ శాఖ అకస్మాత్తుగా మెత్తబడటం వెనుక మతలబు ఏంటనేది హాట్ టాపిక్‌గా మారింది. అడవి నరికివేతకు ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సదరు పెద్దలు మరోసారి అదే పెద్ద మనసుతో వ్యవహరించి జిల్లా వ్యాప్తంగా అటవీ శాఖ కొర్రీలతో ఆగిపోయిన పనులపై దృష్టి సారిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇసుక రవాణాపై చూపించిన శ్రద్ధనే ఏజెన్సీ వాసులు కష్టాల తీర్చడంపైనా చూపిస్తే బాగుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
అధికారుల వైఖరి
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..


