23 నుంచి వాగ్గేయకారోత్సవాలు
● భద్రగిరిలో ఐదు రోజుల పాటు రామదాసు జయంత్యుత్సవాలు ● ఈనెల 27 వరకు స్వర నీరాజనాలు ● పలు ప్రాంతాల నుంచి తరలిరానున్న సంగీత కళాకారులు
భద్రాచలం: వాగ్గేయకారోత్సవాలకు భద్రగిరి సిద్ధమవుతోంది. ఐదు రోజుల పాటు సంగీత కళాకారులు తమ మధుర గీతాలతో ఓలలాడించనున్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆలయ నిర్మాణ కర్త, రామయ్యకు అపర భక్తాగ్రేసరుడైన రామదాసుగా పిలిచే కంచర్ల గోపన్న 393వ జయంతి సందర్భంగా ఈ వేడుకలు జరపనున్నారు. ఈనెల 23 నుంచి 27 వరకు దేవస్థానం, అలివేలు మంగా సర్వయ్య చారిటబుల్ ట్రస్ట్, సామగా నలహరి కల్చరల్ ట్రస్ట్, నాదసురంగణి వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉత్సవాల్లో వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వచ్చే సంగీత కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
నేండ్రగంటి, మల్లాది సోదరులు ప్రత్యేకంగా..
భక్త రామదాసు వాగ్గేయకారోత్సవాలకు సరికొత్త రూపునిచ్చి ప్రఖ్యాతిని పెంచారు చక్ర సిమెంట్స్ అధినేత నేండ్రగంటి కృష్ణమోహన్. రామయ్య, రామదాసుపై భక్తితో ప్రతీ ఏడాది ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ సరికొత్త శోభను పెంచారు. వివిధ ప్రాంతాల నుంచి కళాకారులను రప్పించి భద్రాచలంలో సంగీత నీరాజనాలను సమర్పించేలా కృషి చేశారు. ప్రతీ ఏడాది వాగ్గేయకారోత్సవాల ప్రారంభం రోజున హాజరై స్వామి వారి సేవలో తరిస్తారు. ‘నవరత్న ఘోష్టి’ పేరిట రామదాసు కీర్తనలు ఆలపించి స్వామికి నీరాజనం అర్పిస్తారు. మల్లాది సోదరుల సంగీత ప్రదర్శనలు మరో ఆకర్షణగా నిలుస్తాయి.
కార్యక్రమాలు ఇలా..
ఈ వేడుకల్లో తొలిరోజైన 23వ తేదీన నగర సంకీర్తన, రామదాసు విగ్రహానికి అభిషేకం, చిత్రకూట మండపంలో సభాప్రారంభం, నవరత్న కీర్తనల ఘోష్టి నిర్వహిస్తారు. నేండ్రగంటి కృష్ణమోహన్, మల్లాది సూరిబాబు, మల్లాది శ్రీరామ్‌కుమర్, రవికుమార్‌తో పాటు ఇతరుల ప్రదర్శనలు ఉంటాయి. 24 నుంచి 27 వరకు ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ ఈఓ కొల్లు దామోదర్‌రావు తెలిపారు.


