ముగిసిన బెటాలియన్ క్రీడలు
చుంచుపల్లి: నాలుగు రోజుల పాటు రసవత్తరంగా సాగిన బెటాలియన్ వార్షిక క్రీడలు గురువారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఫైనల్‌కు చేరిన జట్ల పోటీలను ప్రారంభించారు. అనంతరం క్రీడల్లో ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బంది, అధికారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో మానసికోల్లాసంతో పాటు శారీరక దృఢత్వం పెరుగుతాయని చెప్పారు. భవిష్యత్‌లో జరిగే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో జిల్లా పోలీసులు రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్‌ట్లు డి.శ్రీనివాసరావు, కె.శంకర్ పాల్గొన్నారు.
జిల్లా యువతకు రెండు భారీ పరిశ్రమల్లో శిక్షణ
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లా యువతకు రెండు భారీ పరిశ్రమల్లో శిక్షణ, ఉపాధి అవకాశాల కోసం శనివారం ఓరియెంటేషన్, ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్‌ఏఎన్‌ఈ 50, ఎంఆర్‌ఎఫ్‌లో 70 పోస్టులు ఉన్నాయని, ఆసక్తి గల అభ్యర్థులు శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌కు హాజరు కావాలని సూచించారు. యువతకు నాణ్యమైన నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో దేశంలోని ప్రముఖ పరిశ్రమలైన ఆర్‌ఏఎన్‌ఈ(మద్రాస్) లిమిటెడ్, ఎంఆర్‌ఎఫ్ లిమిటెడ్ సంస్థల్లో శిక్షణ, అప్రెంటిస్ అవకాశాలు కల్పించామని వివరించారు. వివరాలకు 93473 53551, 79958 06182 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


