రాజు వెళ్లాకే మహాజాతర.. | - | Sakshi
Sakshi News home page

రాజు వెళ్లాకే మహాజాతర..

Jan 6 2026 7:34 AM | Updated on Jan 6 2026 7:34 AM

రాజు

రాజు వెళ్లాకే మహాజాతర..

ఏటా అడుగుతున్నాం

ఆ తర్వాతనే మేడారం సమ్మక్క జాతర ప్రారంభం

ఏటా మార్చిలో ఇక్కడ పగిడిద్దరాజు జాతర

కనీస సౌకర్యాలు లేక అవస్థ పడుతున్న భక్తులు

దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు గుండాల మండలం యాపలగడ్డలోనే అంకురార్పణ జరుగుతుంది. సమ్మక్క భర్త, సారలమ్మ తండ్రి అయిన పగిడిద్దరాజు స్వగ్రామం యాపలగడ్డ. ఇక్కడి నుంచి పగిడిద్దరాజు మేడారానికి చేరుకుంటేనే జాతరకు బీజం పడుతుంది. రెండేళ్లకోసారి జరిగే మహాజాతరకు అరెం వంశానికి చెందిన పగిడిద్దరాజును గ్రామానికి చెందిన ఆ వంశీయులు తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క–సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. – గుండాల

అరెం వంశీయుడిగా ప్రసిద్ధి

పగిడిద్దరాజు యాపలగడ్డ గ్రామానికి చెందిన అరెం వంశీయుడని, మూడు తరాలుగా కొలుస్తున్నామని ఆ వంశీయులు చెబుతున్నారు. నాటి ఆభరణాలు, ఈటెలు, బల్లెం తదితర వస్తువులు ఇప్పటికీ గుడిలో భద్రపరిచారు. గ్రామ సమీపంలోని తొట్టివాగు వద్ద పగిడిద్దరాజు, సమ్మక్కల గద్దెలు నిర్మించి ఏటా మార్చి మొదటివారంలో పగిడిద్దరాజు జాతర నిర్వహిస్తున్నారు. రెండేళ్లకోసారి ఇక్కడి నుంచే మేడారం జాతరకు పడగల(జెండాల)ను రూపంలో పగిడిద్దరాజును కాలినడకన తీసుకెళ్తారు. రాజు వెళ్లాకే మేడారంలో జాతర ప్రారంభమవుతుంది.

70 కిలోమీటర్లు కాలినడకన..

యాపలగడ్డలో ఉన్న పగిడిద్దరాజు గర్భగుడి నుంచి పడగలకు(జెండాలకు), శివసత్తులకు పురాతన కాలంనాటి ఆభరణాలకు పూజారులు(వడ్డెలు) ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వీరితోపాటు మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం పూనుగొండ్ల గ్రామానికి చెందిన అరెం వంశీయులు కూడా పాల్గొంటారు. పగిడిద్దరాజు గద్దెల వద్దకు తీసుకెళ్లి అక్కడ పూజలు చేస్తారు. జాతర అనంతరం పడగలను తిరిగి యాపలగడ్డకు చేర్చుతారు.

అసౌకర్యాల నడుమ..

మేడారం జాతరకు గుండాల మీదుగా వెళ్లే భక్తులు పగిడిద్దరాజును దర్శించుకుని వెళ్తారు. ఇక్కడ కూడా వంటవార్పు చేసుకుంటారు. ఇక మార్చిలో జరిగే పగిడిద్దరాజు జాతరకు వేలసంఖ్యలో భక్తులు తరలివస్తారు. కానీ కనీస సౌకర్యాలు లేవు. పగిడిద్దరాజు ఆలయానికి నిధులు ఇవ్వాలని మేడారం ట్రస్టును, ఐటీడీఏ అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని అరెంవంశీయులు పేర్కొంటున్నారు. గద్దెల వద్ద ప్రహరీ లేదు. భక్తులకు తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు లేవు. ఆర్చ్‌లు, సీసీ రోడ్లు లేవు. మేడారం జాతరలో పగిడిద్ద రాజు నుంచి వస్తున్న మూడో వంతు డబ్బులతో ఇక్కడ జాతర ఏర్పాట్లు చేస్తున్నారు. గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకోవడంతోపాటు శుభకార్యాలు సైతం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి అభివృద్ధి పనులు చేపట్టాలని, ఫంక్షన్‌ హాల్‌ కూడా నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మేడారం ట్రస్టుతోపాటు ఐటీడీఏ అధికారులను ఏటా గద్దె ల అభివృద్ధికి నిధులు కేటా యించాలని కోరుతున్నాం. మేడారంలో రూ.కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారు. ప్రభుత్వం ఇక్క డ కూడా దృష్టి పెట్టాలి. తాగునీటి సౌకర్యం, మ రుగుదొడ్లు, ప్రహరీ, సీసీ రోడ్లు, ఆర్చిలు నిర్మించాలి. – అరెం కాంతారావు, యాపలగడ్డ

యాపలగడ్డ నుంచి

తరలివెళ్లనున్న పగిడిద్దరాజు

రాజు వెళ్లాకే మహాజాతర..1
1/2

రాజు వెళ్లాకే మహాజాతర..

రాజు వెళ్లాకే మహాజాతర..2
2/2

రాజు వెళ్లాకే మహాజాతర..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement