పంట వ్యర్థాలతో బయోచార్
ఓటరు జాబితాపై అభ్యంతరాలు తెలపాలి
కలెక్టర్ పాటిల్, బయోచార్ నిపుణులు పరశురాం కై లాస్ వెల్లడి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఆధునిక, పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులతోపాటు బయోచార్ వినియోగంపై గరిమెళ్లపాడు నర్సరీలో మంగళవారం రైతులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్, మహారాష్ట్రకు చెందిన ప్రముఖ బయోచార్ నిపుణులు పరశురాం కై లాస్ అఖరే ఆధ్వర్యంలో తక్కువ ఖర్చుతో బయోచార్ తయారీ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ఇనుముతో తయారుచేసిన పరికరంలో పంట అవశేషాలను నిర్దేశిత ఉష్ణోగ్రతతో కాల్చి నాణ్యమైన బయోచార్ ఉత్పత్తి చేసే విధానాన్ని వివరించారు. ఈ బయోచార్‌ను గోమూత్రం, ఆవుపేడ మిశ్రమంలో 15 రోజుల పాటు ఉంచి ఎరువుగా వినియోగిస్తే నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి, భూమి సారవంతంగా మారుతుందని, తేమ నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని వివరించారు. జిల్లాలో సుమారు రెండు లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటలు సాగవుతున్నాయని, పంట కోత తర్వాత వ్యర్థాలను కాల్చకుండా బయోచార్ తయారీకి ఉపయోగించాలని కలెక్టర్ సూచించారు. బయోచార్ వినియోగం వ్యవసాయ రంగానికే పరిమితం కాకుండా డ్రెయినేజీలు, పౌల్ట్రీ షెడ్లు, పశువుల శాలలు, చెత్త నిల్వ ప్రాంతాలు తదితర ప్రాంతాల్లో కూడా విస్తృతంగా ఉపయోగించవచ్చని తెలిపారు. తద్వారా దుర్వాసన తగ్గి గాలి పరిశుభ్రం అవుతుందని, వాతావరణం మెరుగుపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, గ్రామ సర్పంచ్ వాడే రాములు, పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పద్మ, ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు వేముల కామేశ్వరరావు, శ్రీదేవి, ఎన్‌సీసీ ఇన్‌చార్జ్ ధర్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రమేష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీ ముసాయిదా ఓటరు జాబితాల్లో అభ్యంతరాలుంటే రాజకీయ పార్టీలు లిఖితపూర్వకంగా గడువులోగా అందజేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయా పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025 అక్టోబర్ 1 నాటికి ఓటరుగా నమోదు అయిన వారిని ఎపిక్ కార్డులోని చిరునామా ఆధారంగా ఆయా డివిజన్ల ఓటరు జాబితాలో చేర్చామని చెప్పారు. అభ్యంతరాలను ఈనెల 9వ తేదీ వరకు స్వీకరించి, 10న తుది జాబితా ప్రచురిస్తామని వెల్లడించారు. సమావేశంలో కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపల్ కమిషనర్లు చింత శ్రీకాంత్, నాగరాజు, వివిధ పార్టీల ప్రతినిధులు తులసీరామ్, నోముల రమేష్, శ్రీనివాస్, సందీప్, లక్ష్మణ్ అగర్వాల్, కళ్యాణ లక్ష్మీపతి, శంకరయ్య, రమేష్ పాల్గొన్నారు.


