ప్రజా ఉద్యమాలే సీపీఐకి బలం
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని
సుజాతనగర్ : ప్రజా ఉద్యమాలే సీపీఐకి బలమని, ఖమ్మంలో జరిగే పార్టీ శత వసంత ముగింపు సభకు ప్రజలు భారీగా తరలిరావాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. సుజాతనగర్‌లో బుధవారం నిర్వహించిన ప్రచారజాతా ముగింపు సభలో ఆయన మాట్లాడారు. పార్టీ ఆవిర్భవించిన ఈ శతాబ్ద కాలం అనేక ఉద్యమాలు, త్యాగాలతో సాగిందని, రాబోయే వందేళ్లలో కూడా ఇదే స్ఫూర్తితో ముందడుగు వేస్తామని అన్నారు. స్వాతంత్య్రానికి ముందే ఆవిర్భవించిన సీపీఐ సంపూర్ణ స్వరాజ్యం కోసం పోరాడిందని, ఈ క్రమంలో ఎందరో యువ కిశోరాలు ప్రాణత్యాగ్యం చేశారని అన్నారు. నాటి నుంచి నేటి వరకు ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఖమ్మంలో జరిగే సభకు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు 40 దేశాల నుంచి కమ్యూనిస్టు నేతలు, మేధావులు, కవులు హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా, నాయకులు ముత్యాల విశ్వనాధం, కల్లూరి వెంకటేశ్వరరావు, సరెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీకుమారి, శ్రీనివాస్, ఎల్లయ్య, భూక్యా దస్రు, కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, ఉప్పశెట్టి రాహుల్, పూర్ణచందర్‌రావు, వీరస్వామి, రాంబాబు పాల్గొన్నారు.


