సమన్వయంతో జాతర విధులు
ఆర్టీసీ అధికారుల మేడారం రూట్ సర్వే, సమీక్ష
ఖమ్మంమయూరిసెంటర్/ఇల్లెందు: మేడారం జాతరకు వెళ్లివచ్చే ప్రయాణికులు సాఫీగా రాకపోకలు సాగించేలా ఆర్‌టీసీ అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తించాలని ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరామ్ సూచించారు. రీజియన్‌లోని డిపో మేనేజర్లు, అధికారులతో కలిసి ఖమ్మం నుంచి ఇల్లెందు మీదుగా మేడారం వరకు బుధవారం రూట్ సర్వే నిర్వహించారు. అలాగే, మేడారంలో ఆర్టీసీ పాయింట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడే నిర్వహించిన సమీక్షలో, అనంతరం గత జాతరల్లో విధులు నిర్వహించిన ఉద్యోగుల సూచనలు స్వీకరించాక ఆర్‌ఎం మాట్లాడారు. రద్దీకి అనుగుణంగా రీజియన్‌లోని నిర్దేశించిన పాయింట్ల నుండి బస్సులు నడిపిస్తామని తెలిపారు. భక్తులతో డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. డిప్యూటీ ఆర్‌ఎం వి.మల్లయ్య, పర్సనల్ ఆఫీసర్ సంపత్, సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ అధికారి కోటాజి, డిపో మేనేజర్లు శివప్రసాద్, రామయ్య, రాజ్యలక్ష్మీ, లక్ష్మీనారాయణ, జంగయ్య, శ్యాంసుందర్, సునీత తదితరులు పాల్గొన్నారు. కాగా, ఇల్లెందు నుంచి గుండాల, పస్రా, తాడ్వాయి మీదుగా మేడారానికి 129 కి.మీ. కాగా, ఇతర మార్గాల్లో ఈ దూరం పెరగనుంది. దీంతో ఇల్లెందు పాయింట్ నుంచే కాక ఖమ్మం నుంచి మేడారానికి ఇదే మార్గంలో బస్సులు నడిపించనున్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట కార్యాచరణ
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం ఆయన జూమ్ మీటింగ్ ద్వారా మాట్లాడారు. రహదారుల భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు లఘు చిత్రాలను రూపొందించి సినిమా థియేటర్లలో ప్రదర్శించాలన్నారు. పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణాల్లో అవగాహన ర్యాలీలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనాలు నడపొద్దనే అంశాలపై ప్రచారం చేపట్టాలన్నారు. రహదారులపై గుంతలను పూడ్చేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్ పరిసరాలు, లక్ష్మీదేవిపల్లి మోర్ సూపర్ మార్కెట్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొత్తగూడెంలో ఫుట్‌పాత్‌ల వెంట ఉండే చిరు వ్యాపారులను అనువైన ఇతర ప్రాంతాలకు తరలించేలా స్థలాన్ని గుర్తించాలని అన్నారు.


