నవ్విపోదురుగాక !
జలపాతం పేరుతో కవరింగ్
‘రోడ్డు’ పై మాట నిలుపుకోని టీజీఎండీసీ..
● ఇసుక లారీల కోసమే అటవీ శాఖ ప్రత్యేక రోడ్డు ● ఈ వ్యవహారంపై పెదవి విప్పని ఫారెస్టు అధికారులు ● అనుమతి ఎవరిచ్చారనేది అంతుచిక్కని ప్రశ్న
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: నిర్మాణమే జరగని సీతమ్మ సాగర్ బరాజ్ ఎగువ భాగంలో పూడికతీత పేరుతో 2.20 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వి తీసేందుకు తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎండీసీ) అనుమతులు జారీ చేసింది. ఇది ఒక వింతైతే.. ఇప్పుడు మరో విచిత్ర పనిని జిల్లా అటవీ శాఖ – మణుగూరు డివిజన్ చేపట్టింది. ఈ పొరపాటును కప్పిపుచ్చుకునేందుకు కాశీ మజిలీ కథలను మించిన సరికొత్త్త కథ తెరపైకి తెచ్చింది.
ఇసుక లారీలతో వేగలేక
గోదావరి ఇసుకను తరలించేందుకు చర్ల, అశ్వాపురం, మణుగూరు, పినపాక, దుమ్ముగూడెం మండలాల పరిధిలో 20 రీచ్‌లను గుర్తించి, అమ్మకాలు ప్రారంభించారు. అయితే పరిమితికి మించిన లోడుతో ఇసుక లారీలు తిరగడం వల్ల నేషనల్ హైవే రోడ్లే ఛిద్రం అవుతున్నాయి. ఇక ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రోడ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇసుక లారీల దెబ్బకు వాటి రూపురేఖలు మారిపోయి మట్టి రోడ్లు, గుంతలతో నిండిపోయాయి. దీంతో ఈ రోడ్లపై ప్రయాణించే గ్రామీణులు ఇబ్బంది పడుతున్నారు. ఇసుక లారీల ప్రభావంతో చివరకు పిల్లలు స్కూలుకు కూడా వెళ్లే పరిస్థితి లేకపోగా.. మణుగూరు మండలం కమలాపురం, కట్టుగూడెం గ్రామ ప్రజలు గతేడాది అక్టోబర్‌లో లారీలను అడ్డుకున్నారు. దీంతో టీజీఎండీసీ జిల్లా ప్రాజెక్టు అధికారి స్థానికులతో సమావేశమయ్యారు. కొత్త రోడ్డు నిర్మించిన తర్వాతే ఇసుక లారీలు నడిపిస్తామని హామీ ఇచ్చారు. తాత్కాలికంగా ఇసుక రవాణా ఆపేశారు.
నమ్మించి నట్టేట ముంచే ప్రయత్నం..
కొత్త రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చిన టీజీఎండీసీ అధికారి శంకర్‌నాయక్ మళ్లీ అటువైపు కన్నెత్తి చూడలేదు. కానీ, చిన్నరావిగూడెం – కమలాపురం – కట్టుమల్లారం మీదుగా మణుగూరు వరకు ఉన్న పంచాయతీరాజ్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా అటవీ మార్గంలో కొత్త రోడ్డు నిర్మాణం జరిగింది. మణుగూరు రేంజ్ రథంగుట్ట బీట్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఈ మేరకు గత డిసెంబర్‌లో ఆగమేఘాల మీద వేలాది చెట్లను నరికేసి కమలాపురం నుంచి గుట్టమల్లారం వరకు కొత్త రోడ్డు నిర్మించారు. వారం రోజుల పాటు ఈ మార్గం గుండా ఇసుక లారీలు రాకపోకలు సాగించాయి. ఈ లారీల నుంచి అటవీ శాఖ టోలు కూడా వసూలు చేసింది. ఇదే సమయంలో ఇసుక రీచ్‌ల దగ్గర రైజింగ్ కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తున్న కొందరు.. ‘మీ ఊరి మీదుగా మా ఇసుక లారీలను పోనివ్వకుంటే, మాకు మరో దారి దొరకదు అనుకున్నారా? మేం తలచుకుంటే జరగనిది అంటూ ఏమీ లేదు? మాతో పెట్టుకోవద్దు’ అంటూ కమలాపురం, కట్టుమల్లారం గ్రామస్తులను అవమానించడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారు.
ప్రశ్నల పరంపర..
పేద గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల్లో పంటలను బలవంతంగా నాశనం చేయడం. ఏజెన్సీలో అంబులెన్స్ పోయేందుకు వీలుగా రోడ్డు నిర్మిస్తామంటే ఒప్పుకోని అటవీ శాఖ, గట్టుమల్లారం నుంచి కమలాపురం వరకు 50 అడుగులతో 6 కి.మీ. రోడ్డును అంత వేగంగా ఎందుకు నిర్మించిందనే అనుమానాలు వచ్చాయి. ఈ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు ఎందుకు చేశారు ? ఎవరు అనుమతి ఇచ్చారు ? రోడ్డు నిర్మాణానికి బడ్జెట్ ఎక్కడిది? పనులు ఏ పద్ధతిన చేపట్టారు? ఇలా అనేక ప్రశ్నలు అటవీ అధికారులకు ఎదురయ్యాయి.
ఎలాంటి అనుమతులు లేకుండా కేవలం ‘పై స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలు’ అనే ఒకే ఒక్క కారణంతో ఇసుక వ్యాపారుల మెప్పు కోసం అటవీ అధికారులు వేలాది చెట్లను నరికి నిర్మించిన రోడ్డు చివరకు ఆ శాఖ మెడకే చుట్టుకుంది. దీంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు కొత్తగా నిర్మించిన రహదారికి అటు, ఇటు చివరన గేట్లు ఏర్పాటు చేసింది. ఇసుక లారీల రాకపోకలను బంద్ చేయించింది. ఈ కవరింగ్ చాలదన్నట్టుగా ఆ గేట్ల మీద ‘స్వప్న జలపాతం, జాబిల్లి జలపాతాలకు వెళ్లు రోడ్లు’ అని రాయించి కొత్త కలరింగ్ ఇచ్చింది. క్షేత్రస్థాయిలో ఈ రోడ్డు పరిశీలించిన ఎవరికై నా ఇది జలపాతాల కోసం వేసిన రోడ్డు కాదు.. కేవలం ఇసుక లారీల కోసమే వేసిన రోడ్డేనని అర్థమవుతుంది. ఇదొక్కటే కాదు ఇతర ఇసుక రీచ్‌ల కోసం రాజుపేట సమీప అడవిలో నుంచి కూడా ఒక రోడ్డు ఇటీవల పుట్టుకొచ్చింది. రాబోయే రోజుల్లో ఈ రోడ్డుకు జలపాతం తరహాలో ఎలాంటి కలరింగ్, కవరింగ్‌లు అటవీ శాఖ నుంచి వస్తాయనేది ఆసక్తికరంగా మారింది.
నవ్విపోదురుగాక !


