నేటి నుంచి కబడ్డీ కూత
ఐదు రోజుల పాటు అండర్ –17 జాతీయస్థాయి పోటీలు
ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు
33 రాష్ట్రాల నుంచి హాజరైన క్రీడాకారులు
పినపాక: జాతీయస్థాయి అండర్ – 17 బాలుర కబడ్డీ పోటీలకు ఏడూళ్ల బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిద్ధమైంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. క్రీడా ప్రాంగణంలో ఎల్‌ఈడీ స్క్రీన్లు, సుమారు 500 మంది వీక్షించేలా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సింగరేణి సహకారంతో క్రీడా ప్రాంగణం, పార్కింగ్ పరిసరాల్లో భారీ ఎల్‌ఈడీ లైట్లు అమర్చారు. పోటల్లో పాల్గొనేందుకు ఇప్పటికే 33 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు తరలిరాగా, మణుగూరు రైల్వే స్టేషన్‌లో వారికి నిర్వాహకులు స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం నుంచే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
ఇసుక తిన్నెల్లో సాధన..
కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు ముందుగానే చేరుకున్న తెలంగాణ రాష్ట్ర జట్టు మంగళవారం గోదావరి ఇసుక తిన్నెల్లో సాధన చేసింది. మరికొన్ని రాష్ట్రాల వారు వ్యాయామం, యోగా వంటివి చేశారు. క్రీడాకారులకు అధికారులతో పాటు మౌరీ టెక్, కంది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు. ఆయా రాష్ట్రాల వారికి అనుగుణంగా అల్పాహారంలో బ్రెడ్, జామ్, గుడ్లు, సాంబార్, ఇడ్లీ, పూరి వంటి రుచికరమైన వంటలు అందించారు. మధ్యాహ్నం, రాత్రి రోటీలు, చపాతి, సబ్జి, దాల్ ఫ్రై, రైస్, కర్డ్ రైస్ వంటివి సమకూర్చారు.
నేటి నుంచి కబడ్డీ కూత
నేటి నుంచి కబడ్డీ కూత


