వేల సంఖ్యలో నేలకొరిగే! | - | Sakshi
Sakshi News home page

వేల సంఖ్యలో నేలకొరిగే!

Jan 7 2026 7:32 AM | Updated on Jan 7 2026 7:32 AM

 వేల సంఖ్యలో నేలకొరిగే!

వేల సంఖ్యలో నేలకొరిగే!

ఏజెన్సీలో రోడ్ల నిర్మాణానికి అటవీ శాఖ కొర్రీలు

అభ్యంతరాలతో పదుల సంఖ్యలో ఆగిన పనులు

మణుగూరులో మాత్రం ప్రాచుర్యంలో లేని జలపాతాలకు రోడ్లు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లెందు – పాఖాల ఆర్‌అండ్‌బీ రోడ్డులో ఇల్లెందులపాడు చెరువు నుంచి మొండితోగు మీదుగా ధర్మాపురం వరకు రోడ్డు నిర్మాణానికి 2014 – 18 ప్రభుత్వ హయాంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఇల్లెందుకు ఒక బైపాస్‌ రోడ్డు అందుబాటులోకి వచ్చేది. బోడు నుంచి ఇల్లెందుకు ప్రస్తుతం 35 కి.మీ దూరం ఉండగా అది 17 కి.మీ.కు తగ్గిపోయేది. గుండాల – ఇల్లెందు మధ్య దూరం కూడా తగ్గేది. కానీ అటవీ శాఖ కొర్రీలతో ఈ రోడ్డు నిర్మాణం నిలిచిపోయింది. పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన ఆళ్లపల్లి – మామకన్ను గ్రామాలను కలుపుతూ కిన్నెరసానిపై వంతెన నిర్మాణానికి రూ.6 కోట్లు మంజూరయ్యాయి. 2018 – 19 ఆర్థిక సంవత్సరంలో పనులు ప్రారంభించారు. అయితే ఇక్కడ కూడా అటవీ శాఖ కొర్రీలతో వంతెన నిర్మాణ పనులు పిల్లర్ల దశలోనే ఆగిపోయాయి. దీంతో వర్షాకాలంలో మామకన్ను గ్రామస్తులు జిల్లా కేంద్రానికి రావాలంటే అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఇక కిన్నెరసాని డ్యామ్‌ వద్ద కొత్తగా నిర్మిస్తున్న కాటేజీలకు వెళ్లేందుకు అవసరమైన రోడ్డు నిర్మాణానికి సైతం అటవీ శాఖ ఏళ్ల తరబడి అనుమతులు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. దమ్మపేట – పాల్వంచ ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి పీవీటీజీ కొండరెడ్లు ఉన్న పూసుకుంట గ్రామానికి రహదారి నిర్మాణానికీ ఆ శాఖ అధికారులు చాలా రోజులు అంగీకరించలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రభుత్వ నిర్మాణ కార్యక్రమాలకే అటవీ శాఖ అభ్యంతరాలు తెలిపిన జాబితా చాంతాడంత అవుతుంది.

ప్రతిపాదనలతోనే పనులు..

పీవీ కాలనీ క్రాస్‌రోడ్డు నుంచి స్వప్న వాటర్‌ఫాల్‌ (కట్టుమల్లారం), జాబిల్లి వాటర్‌ ఫాల్‌ (కమలాపురం) వెళ్లేందుకు దారి పేరుతో రిజర్వ్‌ ఫారెస్టులో రెండు భారీ వాహనాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా అటవీ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం చకచకా సాగుతోంది. సుమారు 60 ఫీట్లతో ఆరు కి.మీ.మేర రోడ్డు పనులు మొదలయ్యాయి. ఈ దారి కోసం వేల సంఖ్యలో చెట్లను నరికేశారు. భారీ యంత్రాలతో అటవీ ప్రాంతాన్ని చదును చేశారు. అయితే ఈ జలపాతాలను అభివృద్ధి చేయాలనే నిర్ణయాన్ని ఏ సమావేశంలో తీసుకున్నారు.. ఇందుకు అంగీకారం తెలిపింది ఎవరు.. అనే అంశాలపై ఆ శాఖలో ఎవరికీ స్పష్టత లేదు. పై అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు రాకుండానే అటవీ శాఖ, మణుగూరు డివిజన్‌ సిబ్బంది ఈ రోడ్డు నిర్మాణ పనులను వేగంగా చేపడుతున్నారు. దీనిపై వివరణ కోసం మణుగూరు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ఉపేందర్‌కు ఫోన్‌ చేయగా స్పందిచలేదు. కార్యాలయానికి వెళితే అక్కడా లేరు. జిల్లా ఫారెస్టు అధికారి కిష్టాగౌడ్‌ను వివరణ కోరగా ‘జలపాతాలకు వెళ్లేందుకు వీలుగా రోడ్డు నిర్మాణం అంశం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది’ అని తెలపడం గమనార్హం.

పాతది ఉండగా కొత్తది ఎందుకు..?

మణుగూరు నుంచి చిన్నరావిగూడెం గ్రామానికి వెళ్లేందుకు ఇప్పటికే పంచాయతీరాజ్‌ రోడ్డు అందుబాటులో ఉంది. ఇందులో కట్టుమల్లారం గ్రామం నుంచి కిలోమీటర్‌ దూరం నడిస్తే స్వప్న వాటర్‌ ఫాల్‌ వస్తుంది. రోడ్డు పక్కనే శంబాల, జాబిల్లి జలపాతాలు ఉన్నాయి. ఎకో టూరిజం అభివృద్ధి చేయడమే లక్ష్యమైతే కట్టుమల్లారం నుంచి 1.5 కి.మీ రోడ్డు నిర్మిస్తే సరిపోయేది. అందుకు విరుద్ధంగా పీఆర్‌ రోడ్డును పట్టించుకోకుండా అటవీ శాఖనే సొంతంగా.. అదీ పీఆర్‌ రోడ్డుకు సమాంతరంగా తన సొంత జాగాలో రోడ్డు నిర్మాణం చేపట్టింది. అందుకోసం వేలాదిగా చెట్లను కొట్టేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎవరి మెప్పు కోసం అడవిని నరికి రోడ్డు వేశారనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

చెట్ల నరికివేత

ఎవరి మెప్పు కోసమో ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement