14 నుంచి మూడు జిల్లాల స్థాయి వాలీబాల్ పోటీలు
ఇల్లెందురూరల్: మండలంలోని కొల్లాపురంలో సంక్రాంతి సందర్భంగా ఈనెల 14, 15వ తేదీల్లో యంగ్‌స్టార్ యూత్ ఆధ్వర్యాన మూడు జిల్లాల స్థాయి వాలీబాల్ టోర్నీ నిర్వహించనున్నారు. భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల జట్లు పాల్గొనే అవకాశం ఉండగా, మొదటి మూడు స్థానాల్లో నిలిచే జట్లకు రూ.20వేలు, రూ.16వేలు, రూ.12వేలు నగదు బహుమతులు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. క్రీడాకారులు తమ జట్ల వివరాలను ఈనెల 13వ తేదీలోగా 77023 47573, 83416 64923, 96760 52502 నంబర్ల ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.
పకడ్బందీగా ప్రీ ప్రైమరీ తరగతులు
పినపాక: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఆటపాటల ద్వారా బోధన కొనసాగించాలని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి నాగ రాజశేఖర్ సూచించారు. మండలంలోని సింగిరెడ్డిపల్లి యూపీ స్కూల్‌లో బోధనను మంగళవారం టీఎస్‌ఎస్‌ఏ జిల్లా సెక్టోరియల్ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా నాగ రాజశేఖర్ మాట్లాడుతూ బోధనపై పలు సూచనలు చేశారు. అనంతరం చిన్నారులకు సర్పంచ్ ముక్తేశ్వరరావు యూనిఫామ్ అందజేశారు. జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, సైదులు, హెచ్‌ఎం పవన్ పాల్గొన్నారు.
సింగరేణి ప్రమాదంలోకి వెళుతోంది
అసెంబ్లీలో ఎమ్మెల్యే కూనంనేని
కొత్తగూడెంఅర్బన్: తెలంగాణలో సింగరేణి ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్తోందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. సింగరేణి పరిస్థితిపై అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం ఆయన మాట్లాడారు. బొగ్గుగనుల్లో కార్మికులు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పని చేస్తారని, అలాంటి వారికి మెడికల్ ఇన్‌వాలిడేషన్ చేయకుండా వారసులకు ఉద్యోగం ఇచ్చే ప్రక్రియను నిలిపివేయడంతో తీవ్ర అసంతృప్తి ఉందని అన్నారు. రిటైర్డ్ కార్మికులకు పెన్షన్లు కూడా చాలా తక్కువగా వస్తున్నాయని, దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మైన్స్ ఏరియాల్లో ఖాళీ స్థలాలుంటే ఇళ్లు కట్టుకోవడానికి వారికి అవకాశం కల్పించడం లేదని, క్వార్టర్లలో ఉండకుండా బయటకు పంపుతున్నారని, ఇది సరైంది కాదని అన్నారు.
14 నుంచి మూడు జిల్లాల స్థాయి వాలీబాల్ పోటీలు


