మౌనమేల? | - | Sakshi
Sakshi News home page

మౌనమేల?

Jan 6 2026 7:34 AM | Updated on Jan 6 2026 7:34 AM

మౌనమేల?

మౌనమేల?

● ఆరంభంలో ప్రాజెక్ట్‌పై ముగ్గురు మంత్రుల ఫోకస్‌ ● పంపుహౌస్‌ల ప్రారంభం, అనుమతులపైనా దృష్టి ● ఆ తర్వాత ప్రాజెక్టు పనుల్లో కనిపించని పురోగతి ● అష్టకష్టాలు ఎదుర్కొంటున్న డిస్ట్రిబ్యూటరీ పనులు ● అసెంబ్లీలో చర్చకు సైతం రాని సీతారామ ప్రాజెక్ట్‌

తట్టెడు మట్టి ఎత్తలేదు

‘సీతారామ’పై
● ఆరంభంలో ప్రాజెక్ట్‌పై ముగ్గురు మంత్రుల ఫోకస్‌ ● పంపుహౌస్‌ల ప్రారంభం, అనుమతులపైనా దృష్టి ● ఆ తర్వాత ప్రాజెక్టు పనుల్లో కనిపించని పురోగతి ● అష్టకష్టాలు ఎదుర్కొంటున్న డిస్ట్రిబ్యూటరీ పనులు ● అసెంబ్లీలో చర్చకు సైతం రాని సీతారామ ప్రాజెక్ట్‌

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: అసెంబ్లీ సాక్షిగా అధికార, ప్రతిపక్ష పార్టీలు సాగునీటి ప్రాజెక్టులపై గరంగరంగా చర్చలు సాగిస్తున్నాయి. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితి ఏంటనే అంశాలను ఇరు పక్షాలు వివరిస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన సాగునీటి ప్రాజెక్టులపైనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఆ తర్వాత గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుపైనా దృష్టి పెరిగింది. కానీ ఇరు పక్షాలు గొప్పగా ప్రకటించిన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సీతారామ బహుళార్థ సాధక ప్రాజెక్టుపై అసెంబ్లీలో కనీస పట్టింపు కరువైంది.

పురోగతి

కాంగ్రెస్‌ ప్రభుత్వం 2023 డిసెంబరులో అధికారంలోకి రాగానే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంయుక్తంగా సీతారామ ప్రాజెక్టు పనులపై దృష్టి పెట్టారు. ఫలితంగా గతేడాది ఆగస్టు 15న మూడు పంప్‌హౌస్‌లతోపాటు రాజీవ్‌ కెనాల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి జాతికి అంకితం చేశారు. సీతమ్మ సాగర్‌ ప్రాజెక్టు సమగ్ర ప్రణాళిక (డిటెయిల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్టు, డీపీఆర్‌)కు అనుమతులు, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో నమోదైన కేసుపైనా ప్రభుత్వం ఫోకస్‌ చేసింది. ఎట్టకేలకు డీపీఆర్‌కు కీలకమైన టెక్నికల్‌ అనుమతులు వచ్చాయి. ఎన్‌జీటీలో నమోదైన కేసు విషయంలో ఫైన్‌తో పరిష్కారం చూపింది. ఆ తర్వాత ఈ పేపర్‌ వర్క్స్‌లో వేగం తగ్గింది. ప్రస్తుతం వానలు, వరద తగ్గి గోదావరిలో నిర్మాణ పనులకు అనుకూలమైన సమయం వచ్చింది. కనీసం ఇప్పుడైనా బరాజ్‌ నిర్మాణ పనులు మొదలయ్యేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

తగ్గిన జోరు

పంప్‌హౌస్‌లను ప్రారంభించే సమయంలోనే 2024 ఆగస్టులో జిల్లా పరిధిలో కొత్తగా 1,49,952 ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి తెచ్చేలా డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ పనులను 1, 2, 7, 8 ప్యాకేజీల కింద విభజించారు. అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాలకు సంబంధించి యాతాలకుంట టన్నెల్‌ నిర్మాణం పూర్తయితే 7, 8 ప్యాకేజీల కింద నిర్మించే డిస్ట్రిబ్యూటరీ కాల్వల్లో నీరు పారే అవకాశం ఉంది. ఇంకా ఈ టన్నెల్‌ పనులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఇప్పట్లో సత్తుపల్లి, అశ్వారావుపేటలకు గోదావరి నీరు వచ్చే పరిస్థితి లేదు. మరోవైపు ప్యాకేజీలు 1, 2ల కింద డిస్ట్రిబ్యూటరీ పనులు జరిగితే జిల్లాలో అరవై వేల ఎకరాల్లో గోదావరి నీరు పారే అవకాశం ఉంది.

సీతారామ డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీ 1, 2లకు సంబంధించి డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణ పనులకు 2024 ఆగస్టు చివర్లో ఆమోదం వస్తే అక్టోబర్‌లో టెండర్లు పిలిచారు. ఏడాది గడిచినా టెండర్ల ప్రక్రియ కొలిక్కి రాలేదు. భూసేకరణ ప్రక్రి య కూడా పూర్తి కాలేదు. ఏడాదిన్నర గడిచినా జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదు. సీతారామ పనుల్లో 2024 ఆగస్టు 15 వరకు కనిపించిన ఊపు ఆ తర్వాత కూడా కొనసాగి ఉంటే ప్యాకేజీ 1, 2ల కింద డిస్ట్రిబ్యూటరీ కాలు వల పనులు తుది దశకు చేరుకునేవి. ఈ వేసవిలో పనులు పూర్తయితే రాబోయే ఖరీఫ్‌ నాటికి కొత్త ఆయకట్టు అందుబాటులోకి వచ్చేది. ప్రభుత్వం చెప్పినట్టు తొలి విడత అరవై వేల ఎకరాల కొత్త ఆయకట్టుతో సీతారామ ఫలాలు అందేవి. కానీ డిస్ట్రిబ్యూటరీ పనులకు సంబంధించి తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. కనీసం చర్చకు కూడా నోచుకోవడం లేదు. ఇప్పటికై నా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు సీతారామ పనులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement