కార్పొరేషన్ ఎన్నికలు జరిగేనా?
● కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌పై కోర్టుల్లో కేసులు పెండింగ్ ● షెడ్యూల్డ్ ఏరియా కలిపారని, విలీనం సక్రమంగా లేదని పిల్ దాఖలు ● నేడు హైకోర్టులో విచారణకు రానున్న కేసు
పాల్వంచ: వచ్చే ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. గతేడాది మే నెలలో కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పా టు చేస్తూ గెజిట్ విడుదల చేయగా, జనవరి 1న వార్డులకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. అయితే కార్పొరేషన్ ఎన్నికలపై మీమాంస నెలకొంది. ఇప్పటికే కోర్టుల్లో మూడు కేసులు వేయడం, వాటిపై ఇప్పటివరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ఆశావాహుల్లో సైతం టెన్షన్ నెలకొంది. గ్రేడ్–1 మున్సిపాలిటీగా ఉన్న కొత్తగూడెంలో గ్రేడ్–2 ము న్సిపాలిటీ పాల్వంచను, సుజాతనగర్ మండలాన్ని కలుపుతూ కార్పొరేషన్‌గా మార్చారు. పాల్వంచ నుంచి సుజాతనగర్ వరకు 30 కిలోమీటర్ల మేర మధ్యలో రెండు మండలాలను వదిలేసి, అక్కడక్కడా కొన్ని ఏరియాలను కలుపుతూ ఏర్పాటు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో మరో కేసు హైకోర్టుకు చేరింది. ఈ కేసు విషయమై మంగళవారం చీఫ్ జస్టిస్ ముందు వాదోపవాదాలు జరగనున్నాయి.
షెడ్యూల్డ్ ప్రాంతాన్ని కలిపారంటూ..
పాల్వంచలో షెడ్యూల్డ్, నాన్ షెడ్యూల్డ్ ఏరియాలు ఉన్నాయి. 1987 సంవత్సరంలో షెడ్యూల్డ్ ప్రాంతాలను కలిపి మున్సిపాలిటీ చేశారంటూ కరకవాగు గ్రామానికి చెందిన భట్టు కృష్ణ 2024లో హై కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఆర్టికల్ 243జడ్(3) ప్రకారం పార్లమెంట్‌లో ఆమోదం తెలిపాక మున్సిపాలిటీలో కలపాల్సి ఉండగా, గవర్నర్ గెజిట్ ద్వారా కలిపారని, ఇది షెడ్యూల్–5కు విరుద్ధమని, గిరిజన హక్కులను కాలరాస్తున్నారని వాదిస్తున్నారు. పాల్వంచ నుంచి సుజాతనగర్ వరకు చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాలను మినహాయించి అక్కడక్కడా దూర ప్రాంతాలను కలుపుతూ కార్పొరేషన్ చేయ డం అసంబద్ధంగా ఉందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు కోమటిపల్లి, లక్ష్మీదేవిపల్లి, నిమ్మలగూడెం, మంగపేట, నాయకులగూడెం, సుజాతనగర్, నర్సింహసాగర్ పంచాయతీలను ముందస్తుగా గ్రేడ్ల వారీగా కలపాల్సి ఉందని, కానీ నేరుగా కార్పొరేషన్‌లో కలిపారని, ఇది చట్టవిరుద్ధం అంటూ పాల్వంచకు చెందిన శివరాం ప్రసాద్, పోట్రు ప్రవీణ్‌కుమార్, అజ్మీర నరేష్‌నాయక్ సైతం కోర్టులను ఆశ్రయించారు.
నేడు మరోసారి వాదనలు
కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియ సక్రమంగా లేదని, ఏడు పంచాయతీలను అప్‌గ్రేడ్ చేసిన విధానం లోపభూయిష్టంగా ఉండటంతోపాటు కోర్టు పరిధిలో ఉన్నందున ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేయాలని గతేడాది ఆగస్టు 8న హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నాలుగు వారాల గడువు తర్వాత వాదనలు జరిగాయి. మళ్లీ మంగళవారం విచారణ జరగనుంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి కౌంటర్ దాఖలు కాకపోవడం గమనార్హం. దీంతో ప్రక్రియ ఏ మలుపు తిరుగుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


