వసతులేవీ ?
వసతి, వాహనాల పార్కింగే
ప్రధాన సమస్యలు
హైకోర్టు పరిధిలో ట్రస్ట్ స్థల వ్యవహారం..
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటున్న భక్తులు
అభివృద్ధి సరే..
భద్రాచలం: భద్రగిరికి భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. క్రిస్మస్ నుంచి నూతన సంవత్సరం లోపే సుమారు లక్ష మంది రామయ్యను దర్శించుకున్నారు. ఇక ఈ ఏడాది శ్రీరామనవమి, వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు.. ఇలా వరుసగా భక్తజన జాతర నెలకొననుంది. ఈ నేపథ్యంలో సరైన వసతులు లేక భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ, దేవస్థాన గదులు సరిపడా లేకపోవడంతో ప్రైవేటు లాడ్జీల యజమానులు ఇటీవల రోజుకు రూ. 5వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేశారు. కాగా ఇటీవల ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన మాస్టర్ ప్లాన్‌లో ఆలయ అభివృద్ధి నమూనా మాత్రమే ఉండగా వసతి, సౌకర్యాల మాటేంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
రూ.350 కోట్లతో ప్రతిపాదనలు..
భద్రాద్రి రామాలయ అభివృద్ధికి ప్రతిపాదనలు, ప్లాన్ సిద్ధం చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పలుమార్లు పరిశీలించిన అధికారులు.. వైదిక పెద్దలతో సమాలోచనలు చేశాక రామాలయంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి రూ.350 కోట్లతో ప్రతిపాదనలు అందజేశారు. తొలి విడతగా ఆలయ కాంప్లెక్స్ విస్తరణ చేపట్టాలని, మండపాలు, క్యూ హాళ్లు, ప్రసాద విభాగం, పరిపాలనా భవనాల నిర్మాణానికి రూ.115 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. రెండో విడతలో రూ.35కోట్లతో విస్తా కాంప్లెక్స్, అడ్మిన్ బ్లాక్, ఘాట్లు, రహదారులు అభివృద్ధి చేయాలని, మూడో విడతలో కరకట్ట దిగువ భాగాన ఉన్న కాపా రామలక్ష్మమ్మ భూమిలో రామాయణ మ్యూజియం, తూము నర్సింహాదాసు ఆడిటోరియం, భక్త రామదాసు ప్లాజా, మల్టీ లెవల్ పార్కింగ్‌లు నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు. చివరగా ఆలయ అభివృద్ధితో పాటు పట్టణాభివృద్ధి పనులు చేపట్టాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.
పార్కింగ్ కూడా ప్రధానమే..
రానున్న పెద్ద ఉత్సవాల్లో ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు వసతులు, పార్కింగ్ కూడా ప్రధానమే. మొదటి దశలో ఆలయ అభివృద్ధికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిన అధికారులు.. మూడో దశలో పార్కింగ్, భక్తుల వసతికి సంబంధించిన నిర్మాణాల గురించి ప్రస్తావించారు. ప్రతీ సంవత్సరం ముక్కోటి ఏకాదశి, శ్రీరామనవమి ఉత్సవాల సమయంలో భక్తులు వసతి సౌకర్యాలు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘ప్రసాద్’లో భవన నిర్మాణ పనులు చేపట్టినా అది నేటికీ పూర్తి కాలేదు. ఈ భవనంతో పాటు మల్టీ లెవల్ వసతి గదులతోనే సమస్య పరిష్కారం అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధి పనుల ప్రారంభంతో పాటే వసతి గదుల పనులను సైతం చేపట్టాలని, తద్వారా 2027 ఆగస్టులో జరిగే గోదావరి పుష్కరాల నాటికి ఈ సమస్య కొంతైనా పరిష్కారం అవుతుందని అంటున్నారు.
రానున్న రోజుల్లో భద్రగిరికి భక్తుల తాకిడి


