ఆదివాసీ కళలకు
‘కంచు’ కంఠం
భావితరాలకు ఆయనతో శిక్షణ ఇప్పించాలని నిర్ణయం
2024లో సకిని మృతి.. శిక్షణకు కార్యాచరణ ప్రకటించని ప్రభుత్వం
ఆదిలోనే ఆగిపోవడంతో
ఆదివాసీ కళాకారులకు నిరాశ
ప్రోత్సాహమేది..?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఆసియాలోనే అతిపెద్దదిగా పేరున్న సమ్మక్క–సారలమ్మ జాతర కోసం ములుగు జిల్లాలోని మేడారం గ్రామాన్ని సర్వాంగ సుందరంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చెప్పేలా శిలలపై శిల్పాలు చెక్కించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ప్రశంసలు దక్కుతున్నాయి. కానీ ఆదివాసీ కళాకారులకు గుర్తింపు, వారికి ప్రోత్సాహంలో ఈ తరహా చొరవ కనిపించడం లేదు. ఫలితంగా ఆదివాసీ, గిరిజన కళాకారులు తగిన గుర్తింపునకు నోచుకోక వారి కళలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఇందుకు సమ్మక్క–సారలమ్మ వృత్తాంతాలను తెలిపే పద్మశ్రీ సకిని రామచంద్రయ్య జీవితమే ఉదాహరణగా చెప్పవచ్చు.
వృత్తాంత ప్రచార బాధ్యతలు
రామచంద్రయ్యకు పద్మశ్రీ అవార్డు ప్రకటించాక అప్పటి సీఎం కేసీఆర్ స్పందించారు. 2022 ఫిబ్రవరి 1న రామచంద్రయ్యను ప్రగతిభవన్‌కు పిలిపించుకుని అభినందించడమే కాక ఇంటి స్థలం కేటాయిస్తామని, ఇంటి నిర్మాణానికి రూ.కోటి ఆర్థిక సాయాన్ని స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ ద్వారా అందిస్తామని ప్రకటించారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల వృత్తాంతాలను భావితరాలకు తెలిసేలా ప్రచారం చేసే బాధ్యతను రామచంద్రయ్యపై పెట్టారు. వారంలో ఆరు రోజులపాటు ఈ అంశంపై ఆసక్తి ఉన్న ఆదివాసీలకు శిక్షణ ఇవ్వడంతో పాటు గిరిజన విద్యాసంస్థల్లోనూ ప్రచారం చేయాలని సూచించారు. ఇందుకుగాను నెలకు రూ.20 వేలు గౌరవ పారితోషికం ఇస్తామని ప్రకటించి, బాధ్యతను ఐటీడీఏకి అప్పగించారు.
కళ అంతరించిపోవద్దని..
ప్రభుత్వ సూచనల మేరకు ఆదివాసీ కళలపై రామచంద్రయ్య నేతృత్వంలో శిక్షణ – ప్రచార కార్యక్రమాలు ప్రారంభించేందుకు భద్రాచలంలోని గిరిజన మ్యూజియంలో 2022లోనే ఓ గదిని ఐటీడీఏ కేటాయించింది. ఆ తర్వాత నిధుల కేటాయింపు, సరైన కార్యాచరణ లేకపోడంతో కార్యక్రమం ఆదిలోనే ఆగిపోయింది. మరోవైపు సకిని రామచంద్రయ్యకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలైన ఇంటి స్థలం కేటాయింపు, రూ.కోటి ఆర్థిక సాయం అమలుకు నోచుకోలేదు. ఆఖరికి కళాకారులకు అందించే రూ.10వేల పింఛన్ సైతం అందలేదు. చివరి రోజుల్లో అనారోగ్యం పాలై వైద్యం కోసం అప్పులు చేశారు. ఆఖరికి చిన్న ఇంట్లో రూ.2వేల వృద్ధాప్య పింఛన్‌తో బతుకీడుస్తూ 2024 జూలై 23న ఆయన మృతి చెందారు. కంచుతాళం, కంచుమేళం కళలో ఆరితేరిన ఆదివాసీ కళాకారుడిని ఆదుకోలేకపోగా, కళను భావితరాలకు అందించడానికి సరైన రీతిలో ప్రభుత్వం స్పందించలేదనే విమర్శలు వచ్చాయి. మేడారం అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రభుత్వం.. వైఫై, సోషల్ మీడియా జమానా, డీజే హోరులోనూ ఇప్పటికీ ఆదివాసీ కళలు, సంప్రదాయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన కళాకారులను గుర్తించి అండగా నిలవాలని పలువురు కోరుతున్నారు.
మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన సకిని రామచంద్రయ్య ఆదివాసీ సంస్కృతిలో భాగమైన కంచు మేళం, కంచు తాళం(డోలు వాయిద్యం) సాయంతో వనదేవతల వీరగాథలు చెప్పడంలో ప్రసిద్ధి చెందారు. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర సందర్భంగా సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు కథను కళ్లకు కట్టినట్టుగా రామచంద్రయ్య గానం చేసేవారు. జాతరలో చిలకల గుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకొచ్చేప్పుడు ఆయన కీలకంగా వ్యవహరించేవారు. ఈయన ప్రతిభను గుర్తించిన కేంద్రం 2022 జనవరి 25న పద్మశ్రీ అవార్డును ప్రకటించడంతో నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సత్కారం అందుకున్నారు.
వనదేవతల వీరగాఽథలు చెప్పిన పద్మశ్రీ సకిని రామచంద్రయ్య
ఆదివాసీ కళలకు


