స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి
భధ్రాచలం: గిరిజన మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి.రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో చర్ల మండలంలోని సున్నం గుంపు గ్రామానికి చెందిన శ్రీ ముత్యాలమ్మ జాయింట్ లయబిలిటీ గ్రూప్‌నకు సామగ్రి అందజేశారు. ఆది వాసీ గిరిజన మహిళలకు రూ.లక్ష విలువైన ఇప్పపువ్వుతో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేసుకునే సామగ్రిని ఇచ్చారు. అనంతరం గిరిజన దర్బార్‌లో దరఖాస్తులను స్వీకరించి, పరిశీలించి అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దుమ్ముగూడెం మండలం నారాయణపేట గ్రామానికి చెందిన అన్నపూర్ణ భూ సమస్యల పరి ష్కారానికి, అశ్వాపురం మండలం కురువపూర్ గ్రామానికి చెందిన జోగయ్య సోలార్ విద్యుత్ కనెక్షన్‌కు, చండ్రుగొండ మండలం సుజాతనగర్ గ్రామానికి చెందిన దివ్యాంగుడు రాందాస్ ఉద్యోగం కోసం, ఇల్లెందు మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన మంగ్లీ ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా కోసం దరఖాస్తులు అందించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు డేవిడ్ రాజ్, సున్నం రాంబాబు, మధుకర్, వేణు, సైదులు, లక్ష్మీనారాయణ, ఉదయ్‌కుమార్, గన్యా, హరికృష్ణ, ఆదినారాయణ, హేమంత్ పాల్గొన్నారు.
8న రిజిస్ట్రేషన్ మేళా
భద్రాచలం, పరిసర గ్రామాల్లోని ఆహార పదార్థాల వ్యాపారులకు ఈ నెల 8న రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ ఓ ప్రకటనలో తెలిపారు. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, బేకరీలు, కిరాణా దుకాణాలు, మాంసం – చేపల విక్రయ కేంద్రాలు, పాల ఉత్పత్తుల విక్రయదారులు, ఫుడ్ స్టాల్స్, వీధి ఆహార విక్రయదారులు, కేటరింగ్ యూనిట్లు తదితర రకాల ఆహార వ్యాపారులు హాజరై లైసెన్స్ పొందాలని వివరించారు. వ్యాపారులు ఆధార్ కార్డు, పాన్ కార్డ్, పాస్‌పోర్టు సైజ్ ఫొటో, దుకాణం ఫొటోలతో రావాలని సూచించారు.
ఐటీడీఏ పీఓ రాహుల్


