సహకార ఎన్నికలేనా? | - | Sakshi
Sakshi News home page

సహకార ఎన్నికలేనా?

Jan 5 2026 8:07 AM | Updated on Jan 5 2026 8:07 AM

సహకార

సహకార ఎన్నికలేనా?

● డీసీసీబీ, పీఏసీఎస్‌ల రద్దుతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చ ● ఇక నామినేటెడ్‌ పద్ధతిలోనే పాలకవర్గాల భర్తీ అంటూ ప్రచారం ! ● మరోవైపు ఉమ్మడి జిల్లాలో కొత్త పీఏసీఎస్‌ల ఏర్పాటు ● ఈ మేరకు సర్కారుకు ప్రతిపాదనలు

ఇక ఎన్నికలు ఉండవా..?

● డీసీసీబీ, పీఏసీఎస్‌ల రద్దుతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చ ● ఇక నామినేటెడ్‌ పద్ధతిలోనే పాలకవర్గాల భర్తీ అంటూ ప్రచారం ! ● మరోవైపు ఉమ్మడి జిల్లాలో కొత్త పీఏసీఎస్‌ల ఏర్పాటు ● ఈ మేరకు సర్కారుకు ప్రతిపాదనలు

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను ఇక నామినేటెడ్‌ ప్రాతిపదికన ఎన్నుకుంటారనే చర్చ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. ఇప్పటివరకు ఈ సంఘాలకు ఎన్ని కలు నిర్వహించగా.. ఇటీవల ఆయా పాలకవర్గాల ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ సంఘాలకు ఎన్నికలు జరిగాక సొసైటీ చైర్మన్లు, సభ్యులతో పాలకవర్గం ఏర్పడేది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పీఏసీఎస్‌ల చైర్మన్లు డీసీసీబీకి చైర్మన్‌, పాలకవర్గాన్ని ఎన్నుకునే వారు. అయితే ఈ ప్రక్రియ లేకుండా డీసీసీబీ, పీఏసీఎస్‌ల చైర్మన్లను నేరుగా నామినేటెడ్‌ పోస్టులతో భర్తీ చేస్తారనే ప్రచా రం జరుగుతోంది. దీనికి సంబంధించి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమ పరిధిలో ప్రస్తు తం ఉన్న పీఏసీఎస్‌లు, ఇంకా కొత్తగా ఎన్ని ఏర్పాటు చేయవచ్చన్న ఉద్దేశంతో వారే నేరుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.

పాలక వర్గాలకు మంగళం..

జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల పాలక వర్గాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. వీటికి ఇన్‌చార్జ్‌ల నియామకానికి సహకార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీసీసీబీ, పీఏసీఎస్‌ల పాలక మండళ్ల పదవీకాలం గత ఫిబ్రవరిలో ముగియగా వాటినే కొనసాగిస్తూ ఫిబ్రవరి 14, ఆగస్టు 14న రెండుసార్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హఠాత్తుగా ఆ జీఓను రద్దు చేస్తూ.. డీసీసీబీ, పీఏసీఎస్‌లకు అధికారులను ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని వెనుక గల కారణాలను విశ్లేషించే పనిలో ప్రజాప్రతినిధులు పడ్డారు.

సహకార విభజనకు శ్రీకారం..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 101 పీఏసీఎస్‌లు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 76, భద్రాద్రి జిల్లాలో 21, మహబూబాబాద్‌, ములుగు జిల్లాల్లో నాలుగు ఉన్నాయి. అయితే రైతుల అవసరాలకు అనుగుణంగా పెద్ద పీఏసీఎస్‌లను విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా ఖమ్మం జిల్లాలో 20, భద్రాద్రిలో 21, మహబూబాబాద్‌, ములుగు జిల్లాల్లో 4 సంఘాలు పెద్దవిగా గుర్తించారు. వీటిలో నుంచి రెండు లేదా మూడు సంఘాలుగా విభజించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలతో కూడిన నివేదికలు జిల్లా సహకార అధికారుల నుంచి రాష్ట్ర సహకార రిజిస్ట్రార్‌కు అందాయి. ఈ ప్రతిపాదనలను ఆయన పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు.

దీనిలో మర్మమేమిటో..?

ప్రభుత్వం విడుదల చేసిన జీఓలోని అంశాలపై ఉమ్మడి జిల్లాలో చర్చ సాగుతోంది. పాలక వర్గాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికిప్పుడు రద్దు చేయడం ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాలక వర్గాల స్థానంలో పర్సన్‌ ఇన్‌చార్జ్‌లతో కూడిన అధికారుల కమిటీని నియమించాలని, ఆరు నెలల కాలానికి లేదా సంఘాలకు ఎన్నికలు నిర్వహించే వరకు, లేదంటే ప్రభుత్వం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఇది అమలులో ఉంటుందని జీఓలో స్పష్టం చేసింది. దీని ప్రకారం ఆరు నెలల్లో ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందనే చర్చ రాష్ట్రంలో జోరందుకుంది. అయితే జీఓలో మాత్రం సహకార సంఘాలను పునర్‌ వ్యవస్థీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు ప్రస్తుత కమిటీల కాలపరిమితి విషయంలో ప్రత్యేక మినహాయింపులు ఇచ్చినట్లు చెబుతున్నారు.

వైరాలో 21 పీఏసీఎస్‌లకు ప్రతిపాదన..

వైరా నియోజకవర్గ పరిధిలో నూతనంగా 21 పీఏసీఎస్‌ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఏన్కూరు మండలం గార్లొడ్డు పీఏసీఎస్‌ను విభజించి ఐదు పీఏసీఎస్‌లు, సింగరేణి మండలం కారేపల్లి పీఏసీఎస్‌ పరిధిలో మూడు, కొణిజర్ల మండలం గోపవరం పీఏసీఎస్‌ పరిధిలో ఐదు, వైరా మండల కేంద్రంలోని పీఏసీఎస్‌ పరిధిలో నాలుగు, గరికపాడు పీఏసీఎస్‌ పరిధిలో మరొకటి, జూలూరుపాడు పీఏసీఎస్‌ పరిధిలో మూడు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర సహకార రిజిస్ట్రార్‌ పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు.

ప్రభుత్వ నిర్ణయాలను విశ్లేషిస్తున్న రాజకీయ వర్గాలు పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం సర్కారుకు లేదనే అంటున్నాయి. పీఏసీఎస్‌, డీసీసీబీ చైర్మన్లను నేరుగా నామినేటెడ్‌ పోస్టులతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ కారణంగానే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమ పరిధిలో ప్రస్తుతం ఉన్న పీఏసీఎస్‌లు, కొత్తగా ఏర్పాటు చేయాలనే దానిపై నేరుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలుస్తోంది. రానున్న ఆరు నెలల్లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతుండడం గమనార్హం.

సహకార ఎన్నికలేనా?1
1/1

సహకార ఎన్నికలేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement