పునర్వసు మండపంలో రాపత్తు సేవ
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం వైకుంఠ ప్రయుక్త అధ్యయనోత్సవాలలో భాగంగా రాపత్తు సేవలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం పునర్వసు మండపంలో వైభవోపేతంగా సేవలు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారిని మంగళవాయిద్యాలు, భక్తుల శ్రీరామనామస్మరణలు, కోలాటాల నడుమ వేడుకగా పునర్వసు మండపం వరకు తీసుకొచ్చారు. మండపంలో స్వామివారిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలను జరిపి హారతి సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు దారిపొడవునా స్వామివారికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేదపండితులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మూలమూర్తులకు అభిషేకం,
సువర్ణ పుష్పార్చన
దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం తెల్లవారుజామున అభిషేకం, అనంతరం సువర్ణ పుష్పార్చలను జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. సెలవు రోజు కావడంతో భక్తులు స్వామివారి పూజల్లో, ఆర్జిత సేవల్లో అధికంగా పాల్గొన్నారు.
పునర్వసు మండపంలో రాపత్తు సేవ


