ముసురుకున్న మంచు!
చుంచుపల్లి/పాల్వంచరూరల్/ములకలపల్లి : జిల్లాలో రెండు రోజులుగా పొగమంచు కమ్ముతోంది. ఉదయం 9 గంటల వరకు కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. దీంతో వాహనదారులు హెడ్‌లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తోంది. పాల్వంచ – భద్రాచలం ప్రధాన రహదారిపై శనివారం ఉదయం మంచు దట్టంగా ఉండడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో పలువురు డ్రైవర్లు తమ వాహనాలను పక్కనబెట్టి వేచి ఉండాల్సి వచ్చింది. మరికొన్ని చోట్ల ప్రమాదాల బారిన పడుతున్నారు. చలి సైతం పంజా విసురుతుండగా ప్రజలు అల్లాడుతున్నారు. పొగ మంచు, చలి గాలుల నేపథ్యంలో బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. గత వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా గోదావరి పరీవాహక ప్రాంతాలు, అడవులు ఎక్కువగా ఉన్న భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు, పినపాక, ఇల్లెందు, ఆళ్లపల్లి, గుండాల తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా ఉంటున్నాయి. ఉబ్బసం, జలుబు తదితర వ్యాధులున్నవారు చలితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పట్టణాల్లో ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేసేవారు సాయంత్రం వరకే ఇళ్లకు పయనమవుతున్నారు.
ఊటీని తలపిస్తున్న రహదారులు..
గత నాలుగు రోజులుగా చలి విపరీతంగా ఉండడంతో రైతులు, వ్యవసాయ కూలీలు ఉదయమే పొలాలకు వెళ్లలేకపోతున్నారు. ఇక జిల్లాలోని పలు రహదారులను మంచు కమ్మేయడంతో ఊటీని తలపించేలా ఉన్నాయి. అత్యవసరమైన వారు ఉన్ని దుస్తులు ధరించి బయటకు వెళ్తున్నారు. చలి తీవ్రత పెరగడంతో రగ్గులు, స్వెటర్ల విక్రయాలు ఊపందుతున్నాయి. చలి తీవ్రత మరింతగా పెరిగిందని, ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
జిల్లాలో కనిష్ట స్థాయికి చేరిన ఉష్ణోగ్రతలు
ముసురుకున్న మంచు!


