వైభవంగా నదీ హారతి
భద్రాచలం : ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఏరు – ది రివర్ ఫెస్టివల్’లో భాగంగా భద్రాచలంలో గోదావరి మాతకు శనివారం నదీ హారతి సమర్పించారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేయగా.. వేడుకకు హాజరైన కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ.. నదీ సంస్కృతి, ఔన్నత్యాన్ని ప్రజలకు తెలిపేందుకే ఈ వేడుక నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజల కోరిక మేరకు ఇకపై ప్రతీ శనివారం భద్రాచలం గోదావరి తీరంలో నదీహారతి కొనసాగుతుందని, భక్తులు భారీగా హాజరు కావాలని కోరారు.
రామయ్యకు రాపత్తు సేవ..
ముక్కోటి ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా రామయ్యకు వైభవంగా రాపత్తు సేవ నిర్వహించారు. తాతగుడి సెంటర్‌లోని గోవిందరాజ స్వామి రామయ్యకు ఆతిథ్యం ఇచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారిని మంగళవాయిద్యాలు, భక్తుల శ్రీరామనామస్మరణలు, కోలోటాల నడుమ తీసుకొచ్చి గోవిందరాజ స్వామి ఆలయంలో కొలువుదీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం హారతిని సమర్పించారు. భక్తులు దారిపొడవునా స్వామి వారికి ఘనంగా స్వాగతం పలికారు.
వైభవంగా సువర్ణ తులసీ అర్చన
దేవస్థానంలోని మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామివారికి కంకణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రక్తంగా నిర్వహించారు.
శాశ్వత నిత్యాన్నదానానికి విరాళాలు
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదానానికి హైదరాబాద్‌కు చెందిన రాజకుమార్, శోభారాణి దంపతులు రూ. 1,11,116, విజయవాడకు చెందిన సుబ్బారావు, ఝాన్సీలక్ష్మి రూ.1,01,116 విరాళాలను శనివారం అందజేశారు. వారికి ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబు రసీదును ఇచ్చారు.
రామయ్యకు గోవింద మండపంలో
రాపత్తు సేవ


