సంచి లేకుండా సరదాగా..
ప్రతీ నెల నాలుగో శనివారం ప్రభుత్వ స్కూళ్లలో అమలు మూడు నెలలుగా జిల్లాలో నిర్వహణ నృత్యాల ద్వారా అభ్యసనం.. సైన్స్ ప్రయోగాలు, స్ఫూర్తిప్రదాతల పరిచయం
ఖమ్మంసహకారనగర్: పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు బ్యాగుల మోతతో, రివిజన్లతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రతిరోజు పాఠశాలకు ఈ బ్యాగులను మోసుకెళ్లాల్సిందే. దీనిని గుర్తించిన ప్రభుత్వం నెలలో ఒక్కరోజు అయినా ‘నో బ్యాగ్ డే’నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా అమలుకు ఆదేశించినా కొన్ని చోట్ల మాత్రమే దీని అమలు చేస్తున్నారు. మూడు నెలలుగా జిల్లాలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చొరవతో ప్రతీ నెల 4వ శనివారం నో బ్యాగ్ డేను నిర్వహిస్తున్నారు. ఆ రోజున ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు బ్యాగ్‌లు, పుస్తకాలు లేకుండా పాఠశాలకు వచ్చి పూర్తిస్థాయిలో ఆహ్లాదకర వాతావరణంలో విద్యాబుద్ధులు నేర్చుకోవడంతోపాటు ఆటలు, పాటలు, ప్రయోగాలతో గడపుతున్నారు.
విద్యార్థుల్లో ఆహ్లాదాన్ని నింపేందుకు..
ప్రతీ రోజు విద్యార్థులు తరగతులు, క్లాస్‌రూంలో పాఠాలు, పుస్తకాల బరువుతో పాఠశాలలకు వచ్చి వెళ్తుంటారు. దీంతో విద్యార్థులు పాఠశాలకు రావాలంటే ఉత్సాహం కనబర్చడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం వారిలో పాఠశాలల పట్ల ఆసక్తిని, ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేసింది. నెలలో ఒకరోజు నో బ్యాగ్ డే నిర్వహించాలని విద్యాశాఖను ఆదేశించింది. ఈ క్రమంలో జిల్లాలో ఆగస్ట్ నుంచి అన్ని పాఠశాలల్లో ప్రతీ నెల నాలుగో శనివారం నో బ్యాగ్ డేను అమలు చేస్తున్నారు. అప్పటి నుంచి నాలుగో శనివారం విద్యార్థులు తప్పనిసరిగా పాఠశాలలకు హాజరవుతూ ఉత్సాహభరిత, వాతావరణంలో విద్యాభ్యాసం చేస్తున్నారు. నృత్యాల ద్వారా కూడా అభ్యసనం చేస్తున్నారు.
సృజనాత్మకత వెలికితేసేలా..
ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులకు వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేలా చిన్న చిన్న పనులు అప్పగిస్తుంటారు. వెజిటబుల్ కార్వింగ్‌తో చిన్న చిన్న వస్తువుల ఆకారాలను తయారు చేయిస్తారు. ఈసీఆర్ కాంపిటీషన్స్, ఇసుకతో సైకత నమూనాలు చేసేలా ప్రోత్సహిస్తారు. పలు రకాల క్రీడలు నిర్వహించి, విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపుతారు. ఆరు నుంచి 10వ తరగతి విద్యార్థులకు సులభతర సైన్స్ ప్రయోగాలు, టీఎల్‌ఎం ఎక్స్‌పో, స్ఫూర్తి ప్రదాతల స్పీచ్‌లు, క్విజ్ కాంపిటీషన్స్, క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో ఆసక్తిని పెంచుతారు.


