నేడే గురుకుల స్వర్ణోత్సవం..
కిన్నెరసాని గిరిజన గురుకుల
పాఠశాలకు యాభై ఏళ్లు
నాటి ప్రాభవం కోల్పోయిన పాఠశాల
అసౌకర్యాల నడుమ
విద్యార్థుల చదువులు
పాల్వంచరూరల్: కిన్నెరసాని డ్యామ్‌సైడ్ గిరిజన గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలకు సిద్ధమైంది. పాఠశాలను స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నేడు గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించనున్నారు. అర్ధశతాబ్ద కాలంలో ఇక్కడ చదువుకుని దేశ, విదేశాల్లో స్థిరపడిన పూర్వవిద్యార్థులు వేడకకు హాజరుకానుండగా.. అన్ని తామై ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ స్వర్ణోత్సవాల వేడుకకు గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి సీతాలక్ష్మితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, పీఓ రాహుల్‌లు ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు. కాగా , 50 ఏళ్ల క్రితం 70 ఎకరాల విస్తీర్ణం కలిగిన పాఠశాల ప్రాంగణంలో నిర్మించిన భవన సముదాయం శిథిలావస్థకు చేరడంతో గతేడాది కూల్చివేశారు.
సమస్యలతో సతమతం..
మండల పరిధిలోని కిన్నెరసాని డ్యామ్‌సైడ్‌లో ఏపీ రెసిడెన్సీ ఇన్‌స్టిట్యూషన్స్ బాలుర స్కూల్‌ను 1975 డిసెంబర్ 25న సంజయ్‌గాంధీ, అప్పటి రాష్ట్ర సీఎం జలగం వెంగళరావు శంకుస్థాపన చేయగా ఏడాది తర్వాత ప్రారంభించారు. మొదట స్కూల్, తర్వాత కళాశాలగా అప్‌గ్రేడ్ కాగా, ప్రస్తుతం 500 మందికి పైగా గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కానీ వారి సంఖ్యకు అనుగుణంగా వసతులు లేక తరగతి గదిలోనే చదువుకుంటూ, రాత్రివేళ అందులోనే పడుకోవాల్సి వస్తోంది. చుట్టూ ప్రహరీ లేకపోవడం, భోజనశాల శిథిలావస్థకు చేరడం, తరగతి గదులు కురుస్తుండడంతో విద్యార్థులు చదువులపై దృష్టి సారించలేకపోతున్నారు. బెంచీలు, బల్లాలు కూడ విరిగి పనికిరాకుండా పోయాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి 12 గదులతో కూడిన అకడమిక్ బ్లాక్, హాస్టల్ బ్లాక్‌ను మంజూరు చేయాలని మండలవాసులు కోరుతున్నారు.
నేడే గురుకుల స్వర్ణోత్సవం..


