శ్రామిక విభజనను వ్యతిరేకిద్దాం..
● వచ్చే ఏడాది కార్మిక సంఘాలకు కీలకం ● సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు పద్మనాభన్
ఖమ్మంమయూరిసెంటర్ : ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శ్రామిక వర్గాన్ని విభజించి కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చేలా ప్రయత్నిస్తోందని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ ఎ.కె. పద్మనాభన్ అన్నారు. ఖమ్మంలో నిర్మించిన సీఐటీయూ జిల్లా కార్యాలయం (బీటీ రణదివే) భవనాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అంతకుముందు పెవిలియన్ గ్రౌండ్ నుంచి గట్టయ్య సెంటర్‌లోని భవనం వరకు కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. రణదివే పేరుతో ఉన్న స్మారక భవనాన్ని ప్రారంభించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. సీఐటీయూ అన్ని కార్మిక సంఘాల వంటిది కాదని, వర్గపోరాటాలు నిర్వహించడంలో దీని పాత్ర భిన్నమైనది, సవాళ్లతో కూడుకున్నదని అన్నారు. 2026 శ్రామిక వర్గానికి ముఖ్యమైన సంవత్సరంగా ఉండబోతుందన్నారు. సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ కార్పొరేట్లకు బీజేపీ ప్రభుత్వం ఊడిగం చేస్తోందని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాట వేదికై న ఖమ్మంలో సీఐటీయూ భవనానికి బీటీ రణదివే పేరుపెట్టడం గర్వకారణమని అన్నా రు. అంతకుముందు సంఘ పతాకాన్ని సీనియర్ నేత పి.రాజారావు ఆవిష్కరించారు. సభలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు, ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌రావు, ఉపాధ్యక్షులు నున్నా నాగేశ్వరరావు, నాయకులు బి.మధు, జ్యోతి, వజ్రాల శ్రీనివాసరావు, కళ్యాణం వెంకటేశ్వరరావు, తుమ్మ విష్ణు, పిన్నింటి రమ్య తదితరులు పాల్గొన్నారు.


