ఎగ్ బిర్యానీ వడ్డించరా..?
అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రారంభించి చేతులు దులుపుకున్న అధికారులు
నిధుల కేటాయింపుపై స్పష్టతలేకపోవడంతో ఆసక్తి చూపని టీచర్లు
భద్రాచలంఅర్బన్: అంగన్‌వాడీ కేంద్రాల్లో గత జూన్‌లో ప్రారంభించిన ఎగ్ బిర్యానీ పథకాన్ని అమలు చేయడంలేదు. కొరవడిన సౌకర్యాలు, నిధుల లేమితో ఎగ్ బిర్యాని సొంత ఖర్చులతో భరించలేమని టీచర్లు చేతులెత్తేయడంతో పథకం ఒక్కరోజుతోనే ముగిసిపోయింది. ఆరోగ్య లక్ష్మి పథకంలో భాగంగా గత జూన్ 11న ఎగ్ బిర్యాన్నీ పథకాన్ని అమలులోకి తెచ్చారు. ప్రారంభానికి ఉత్సాహం చూపిన అధికారులు ఆ తర్వాత అమలుపై దృష్టి పెట్టలేదు. జిల్లాలో 2060 అంగన్‌వాడీ కేంద్రాలుండగా వీటి పరిధిలో 8,068 మంది గర్భిణులు, 3,567 మంది బాలింతలు, 3 ఏళ్లలోపు పిల్లలు 33,954 మంది, 3 ఏళ్ల నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులు 27,622 మంది లబ్ధిదారులుగా ఉన్నారు. కేంద్రాల్లో వచ్చే పిల్లల సంఖ్య పెంచేందుకు అమ్మ మాట అంగన్‌వాడీ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఎగ్ బిర్యానీ పథకం ప్రారంభించారు. కేంద్రంలో ఉండే బియ్యం, ఆహార పదార్థాలతో వారానికి రెండు సార్లు ఎగ్ బిర్యానీ అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసి ఐదు నెలలు దాటింది. కానీ అదనపు నిధులు కేటాయించలేదు. ఇప్పటికే పెండింగ్ బిల్లులు కూడా చెల్లించడంలేదని, ఇంకా ఎగ్ బిర్యానీ తయారీకి డబ్బులు ఎక్కడి నుంచి తేవా లని అంగన్‌వాడీ టీచర్లు పేర్కొంటున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు అల్పాహారం సైతం అందిస్తామని సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ప్రకటించారు. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు.
స్పష్టత కూడా లేదు...
పథకాన్ని ప్రారంభించాక ఐసీడీఎస్ అధికారుల సూచనలతో జిల్లాలో కొందరు అంగన్‌వాడీ టీచర్లు ఎగ్ బిర్యానీ తయారు చేసి వడ్డించారు. ఆ తర్వాత నిధులు విడుదలో జాప్యం జరగడంతో మానేశారు. బిర్యానీ తయారీకి మసాలా దినుసులను ప్రభుత్వం సరఫరా చేస్తుందా,? టీచర్లే కొనుగోలు చేసి బిల్లులు పెట్టాలా? అనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దీంతో టీచర్లు ముందుకు రావడం లేదు. సంబంధింత అధికారులు స్పందించి ఎగ్ బిర్యాన్నీ పథకాన్ని అమలు చేయాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


