
పోరుకు సన్నద్ధం
సిద్ధంగా ఉన్నామంటూ
రాష్ట్ర ఈసీకి లేఖ
ఈసారి రెండు విడతల్లో
పోలింగ్ నిర్వహణ
స్థానిక రిజర్వేషన్లపై నెలకొన్న
అయోమయం
షెడ్యూల్ ఎప్పుడొచ్చినా సిద్ధమే
చుంచుపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. సెప్టెంబర్‌లో ఎన్నికలకు సిద్ధమంటూ కేబినెట్ ఆమోదం తెలపగా.. ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి శనివారం లేఖ అందించింది. దీంతో వచ్చే నెలలో స్థానిక ఎన్నికల నగారా మోగనుంది. అటు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును కూడా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి రిజర్వేషన్ల అంశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతేడాది లోక్‌సభ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థలకూ పోలింగ్ జరుగుతుందని భావించినా.. రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయలేదు. ఇప్పుడు ఈసీకి లేఖ అందించడంతో మొదట జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు, ఆ తర్వాత గ్రామ పంచాయతీలకు రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలుకానుంది. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై ఆశావాహుల్లో కొంత అయోమయం నెలకొంది.
రెండు విడతల్లో ఎన్నికలు..
ఈసారి స్థానిక ఎన్నికల పోలింగ్‌ను రెండు విడతల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. 2019లో జరిగిన గ్రామ పంచాయతీ, పరిషత్ ఎన్నికలను రెవెన్యూ డివిజన్ల వారీగా మూడు విడతల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. దీన్ని ప్రస్తుతం మార్పు చేస్తూ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రెండు విడతల్లో ఎన్నికల నిర్వహణకు ప్రణాళిక తయారు చేశారు. జిల్లాలో తొలివిడతలో అశ్వాపురం, భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం, కరకగూడెం, మణుగూరు, పినపాక, ఆళ్లపల్లి, టేకులపల్లి, ఇల్లెందు, గుండాల మండలాల్లో, మలి విడతలో చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, జూలూరుపాడు, పాల్వంచ, దమ్మపేట, అశ్వారావుపేట, ములకలపల్లి, చండ్రుగొండ,అన్నపురెడ్డిపల్లి మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
బ్యాలెట్ పేపర్లు, బాక్సులు రెడీ..
ఇప్పటికే ఓటరు జాబితా, బ్యాలెట్ పెట్టెలు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, సిబ్బంది, నోడల్ అధికారుల నియామకం పూర్తి చేశారు. జిల్లాలో ఉన్న బ్యాలెట్ బాక్సులతో పాటు గతంలో కర్ణాటక నుంచి మరికొన్నింటిని తెప్పించిన విషయం తెలిసిందే. ఎన్నికల నిమిత్తం జంబో బాక్సులు 1,811, మీడియం బాక్సులు 351 అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా మరో 1,000 బాక్సులు అదనంగా తెిప్పించనున్నారు. జిల్లాలో ఎన్నికలు జరిగే 471 గ్రామ పంచాయతీల్లో 4,168 వార్డులు ఉన్నాయి. ఇక జెడ్పీటీసీ స్థానాలు 22, ఎంపీటీసీ స్థానాలు 233 ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థులకు గులాబీ రంగు, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు ముద్రించి స్ట్రాంగ్ రూమ్‌ల్లో భద్రపరిచారు. పంచాయతీ ఎన్నికలకు10,223 మంది, పరిషత్ ఎన్నికలకు 8,711 మంది సిబ్బంది అవసరమని అధికారులు గుర్తించారు. పంచాయతీ ఎన్నికలకు 4,242, పరిషత్‌లకు 1,271 పోలింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచారు.
‘స్థానిక’ ఎన్నికలకు
రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఎప్పుడు ఆదేశాలు వచ్చినా పోలింగ్ నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం. ఈసారి రెండు విడతల్లో పరిషత్ ఎన్నికలు నిర్వహించేలా ప్రతిపాదనలు చేశాం. జిల్లాలోని 22 జెడ్పీటీసీ, 233 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నాం. –బి.నాగలక్ష్మి, జెడ్పీ సీఈఓ

పోరుకు సన్నద్ధం