
అదే వరుస.. తీరని గోస
ఇల్లెందురూరల్/పినపాక/చండ్రుగొండ/మణుగూరుటౌన్ : ప్రస్తుతం అప్పుడప్పుడూ తెరపినిస్తూ కురుస్తున్న వర్షాలు సాగుకు అనుకూలంగా ఉండగా.. పంటలకు ఎరువులు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. మొక్కజొన్న, పత్తి, వరి పంటలకు యూరియా వేసే తరుణం కావడం, డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడంతో ఆ ఎరువు కోసం ప్రతీ చోట రైతులు బారులుదీరుతున్నారు. తెల్లవారకముందే విక్రయ కేంద్రాల వద్దకు చేరుకుని, క్యూలో నిల్చునే ఓపిక లేక చెప్పులు, పట్టాదారు పాస్ పుస్తకాలను లైన్‌లో పెట్టి పక్కన కూర్చుంటున్నారు. జిల్లాలోని ఇల్లెందు, పినకపా, మణుగూరు, చండ్రుగొండ తదితర ప్రాంతాల్లో శనివారం కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇల్లెందు మండలం కొమరారం కేంద్రానికి 450 బస్తాల యూరియా రాగా అంతకుమించిన సంఖ్యలో రైతులు రావడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పినపాకలో గత మూడు రోజులుగా యూరియా ఇవ్వడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చండ్రుగొండ మండలం గానుగపాడులో శనివారం తెల్లవారకముందే భారీగా చేరుకున్న రైతులు క్యూలో నిల్చున్నా.. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మణుగూరు మండలానికి 60 – 70 టన్నుల యూరియా రావాల్సి ఉండగా, 10 రోజులుగా దిగుమతి కాలేదు. శుక్రవారం 10 టన్నుల మేర వచ్చిందనే విషయం తెలుసుకున్న రైతులు శనివారం తెల్లవారుజామునే చెప్పులు క్యూలో పెట్టి నిరీక్షించారు. ఇప్పటికై నా తమ ఇక్కట్లు తొలగించి సరిపడా యూరియా సరఫరా చేయాలని కోరుతున్నారు.
యూరియా కోసం రైతుల నిరీక్షణ

అదే వరుస.. తీరని గోస