
ఇల్లెందు రూరల్: కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో యువతి బతికి ఉండగానే కుటుంబ సభ్యులు శ్రద్ధాంజలి ఫ్లెక్సీలు కట్టారు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బొజ్జాయిగూడెంకు చెందిన కొచ్చర్ల వెంకటేశ్, కుంజ సింధు ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరికీ తండ్రులు లేరు. వెంకటేశ్, సింధు వారం క్రితం పెళ్లి చేసుకున్నారు. ఆపై కుటుంబీకుల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించడంతో వారు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆపై వెంకటేశ్, సింధు గ్రామంలోని సమీప బంధువుల ఇంట్లో ఆశ్రయం తీసుకుంటున్నారు.
వెంకటేశ్‌పై పోలీసు కేసు ఉన్న విషయం తెలియడంతో సింధు తల్లి నాగమణి కుమారులతో కలిసి భర్త లేని సమయంలో సింధుకు నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్లారు. దీనిపై వెంకటేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు సింధును ప్రశ్నించడంతో తల్లితోనే ఉంటానని చెప్పింది. వెంకటేశ్ మాత్రం అదే విషయం సింధు తన ముందు చెప్పాలని పేర్కొనగా గ్రామ పెద్దమనిషి ఒకరు సింధును వెంకటేశ్ వద్దకు తీసుకెళ్లగానే ఆమె భర్తతోనే ఉంటానని చెప్పడంతో సింధును పోలీసులు వెంకటేశ్‌కు అప్పగించారు. దీంతో సింధు తల్లి, సోదరులు మనోవేదనకు గురై ఆమె చనిపోయినట్లుగా పేర్కొంటూ శనివారం గ్రామంలోని వీధుల్లో శ్రద్ధాంజలి ఫెక్ల్సీలు ఏర్పాటు చేశారు.