
దివ్యాంగుల్లో సామర్థ్యాలను గుర్తించాలి
కొత్తగూడెంఅర్బన్: దివ్యాంగులు ప్రత్యేక సామర్థ్యాలు గలవారని, వాటిని గుర్తించి భవిష్యత్‌లో వారు రాణించేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. సమగ్ర శిక్ష, ఆలింకో ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మూడు రోజుల పాటు జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఈ దివ్యాంగుల శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వం ఉచితంగా అందించే ఉపకరణాలు పొందాలని సూచించారు. జిల్లాలోని 17 మండలాల్లో దివ్యాంగులు విద్యనభ్యసించేలా భవిత కేంద్రాలు నిర్మించనున్నట్లు తెలిపారు. ట్రెయినీ కలెక్టర్ సౌరభ్ శర్మ మాట్లాడుతూ దివ్యాంగులు వైకల్యం ఉందని బాధపడకుండా సంకల్పంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో డీఈఓ బి.నాగలక్ష్మి, జిల్లా సమ్మిళిత విద్య కోఆర్డినేటర్, ఎస్‌కే సైదులు, ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్. సతీష్ కుమార్, అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ. నాగరాజశేఖర్, ఆలింకో డాక్టర్లు ప్రియా శర్మ, వికాస్, ప్రధానోపాధ్యాయులు మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.
మేకల పెంపకాన్ని ప్రోత్సహించాలి..
సూపర్‌బజార్(కొత్తగూడెం): గ్రామీణ ప్రాంతాల్లో మేకల పెంపకం, షెడ్ల నిర్వహణ, పశుగ్రాస ఉత్పత్తి తదితర అంశాలపై రైతులకు, పశువుల కాపరులకు అవగాహన కల్పించడంతో పాటు వారిని ప్రోత్సహించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మేకల పెంపకం, మేకపాలు, ఉత్పత్తుల తయారీపై ఉత్తరప్రదేశ్‌లో శిక్షణ పొందిన ముగ్గురు పశు వైధ్యాధికారులతో శనివారం ఆయన సమావేశమయ్యారు. శాసీ్త్రయ పద్ధతుల్లో మేకల పెంపకం, స్థానిక మేక జాతుల అభివృద్ధి, కృత్రిమ గర్భధారణ, మెరుగైన విత్తనపు పోతుల లభ్యత, పశుగ్రాస రకాలు, దాణా మిశ్రమ పధార్థాల లభ్యత, సమయానుకూల ఆరోగ్య పరిరక్షణ చర్యలు వంటి అంశాలపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. పైలట్ ప్రాజెక్టుగా ఒక గ్రామం నుంచి ఇద్దరు ఔత్సాహిక పశుపోషణ రైతులను ఎంపిక చేసి పై అంశాల అమలుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో రామవరం, సారపాక, చండ్రుగొండ పశువైద్య కేంద్రాల డాక్టర్లు జి. అనందరావు, సీహెచ్ బాలకృష్ణ, వి.సంతోష్ పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి. పాటిల్