
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. కాగా, ఏపీలోని ఆముదాల వలస ఎమ్మెల్యే కూనా రవికుమార్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీసీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. వీరికి అర్చకులు స్వాగతం పకలగా ఆలయ ప్రదక్షిణ అనంతరం మూలమూర్తులను దర్శించుకున్నారు.
సివిల్ సర్వీసెస్ టోర్నీకి దరఖాస్తుల ఆహ్వానం
కొత్తగూడెంటౌన్: ఈనెల 9వ తేదీ నుంచి నిర్వహించే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నీలో పాల్గొనేందుకు ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీవైఎస్‌ఓ ఎం.పరంధామరెడ్డి తెలిపారు. రాష్ట్ర స్థాయిలో 19 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 9, 10వ తేదీల్లో హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్, ఎల్‌బీ స్టేడియంలో వివిధ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 4వ తేదీలోగా తమ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని, వివరాలకు 95054 23226 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
సీజనల్ వ్యాధులపై
అప్రమత్తంగా ఉండాలి
డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి
బూర్గంపాడు: సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ జయలక్ష్మి ఆదేశించారు. మోరంపల్లిబంజర పీహెచ్‌సీలో మంగళవారం ఆమె రికార్డులు తనిఖీ చేశారు. ఫార్మసీ గది, ఇన్‌పేషెంట్ వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. వానాకాలంలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. 24 గంటలూ వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీసాహితి, సిబ్బంది పాల్గొన్నారు.
నెమ్మదిగా తగ్గుతున్న గోదావరి
భద్రాచలంటౌన్ : భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం నెమ్మదిగా తగ్గుతూ మంగళవారం రాత్రి 9.30 గంటలకు 40 అడుగులకు చేరింది. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి వదరనీటి ప్రవాహం తగ్గింది. సోమవారం రాత్రి నీటిమట్టం 42 అడుగులు ఉండగా 24 గంటల వ్యవధిలో ప్రవాహం రెండడుగుల మేర తగ్గింది. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి వరద లేకపోవడంతో గోదావరి నీటి ప్రవాహం మరింత తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు.
బీఈడీలో ప్రవేశాలకు అర్హుల జాబితా విడుదల
భద్రాచలం: భద్రాచలం గిరిజన బీఈడీ కళాశాలలో 2025 – 2027 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఎంపికై న వారి జాబితా విడుదల చేసినట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. డీడీ మణెమ్మ, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ వీరునాయక్ సమక్షంలో మెరిట్ జాబితాను మంగళవారం తన చాంబర్‌లో ప్రకటించారు. ఈ సందన్భంగా ఆయన మాట్లాడుతూ.. డిగ్రీ పార్ట్– 2లో వచ్చిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పించామని చెప్పారు. 100 సీట్లకు గాను 500 దరఖాస్తులు వచ్చాయని, నిబంధనల ప్రకారం భర్తీ చేశామని తెలిపారు. సీటు సాధించిన విద్యార్థులను త్వరలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు.

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం