
‘ఆది కర్మయోగి’ని గిరిజనుల చెంతకు చేర్చాలి
భద్రాచలం: సేవ, సంకల్ప, సమర్పణ అనే లక్ష్యంతో ప్రభుత్వం అందజేస్తున్న ఆది కర్మయోగి అభియాన్ పథకాన్ని గిరిజనుల చెంతకు చేర్చేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహిస్తున్న మండల స్థాయి శిక్షణ కార్యక్రమానికి మంగళవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మారుమూల గ్రామాల గిరిజనుల ఆచారాలు, జీవన శైలి విభిన్నంగా ఉంటాయని, వారి సమస్యలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. గ్రామసభలు నిర్వహించి విద్య, వైద్యం, వ్యవసాయం, తాగునీరు, మేకల పెంపకం, మునగ సాగు, జీవిత బీమా, ఆది సురక్ష బీమా వంటి పథకాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న ప్రతి ఒక్కరూ నిబద్ధతగా విధులు నిర్వర్తించాలన్నారు. పీఓ రాహుల్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రతీ గిరిజన కుటుంబానికి చేరేలా కృషి చేయాలన్నారు. గిరిజనుల జీవనోపాఽధి పెంపునకు రూపొందించిన ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈనెల 9, 10 తేదీల్లో గ్రామాల్లో పర్యటించాలని, 19 మండలాల్లోని 130 గ్రామాలలో పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని అన్నారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, డీడీ మణెమ్మ, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనినా, డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి, ఏఓ సున్నం రాంబాబు, మాస్టర్ శిక్షకులు మధువన్, మాధవరావు, జస్వంత్ ప్రసాద్, సంతోష రూపా, సలీం తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్