
నిమజ్జనంలో జాగ్రత్తలు పాటించాలి
పథకాలు నేరుగా అర్హులకు అందాలి
భద్రాచలంఅర్బన్ : భద్రాచలం గోదావరి వద్ద వినాయక నిమజ్జనాల్లో జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. గోదావరి ఘాట్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను గురువారం ఆయన సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిమజ్జనం విధులు నిర్వర్తించే సిబ్బంది భక్తులకు అందుబాటులో ఉండాలని, ప్రమాదాల నివారాణకు కృషి చేయాలని అన్నారు. విగ్రహాలను నిమజ్జనానికి తీసుకొచ్చే భక్తులు పోలీసుల సూచనలు పాటించాలని, డీజే, సౌండ్ బాక్సులు ఏర్పాటు చేయొద్దని కోరారు. కాగా ఈ ఏడాది భద్రాచలంలో సుమారు రెండు వేల విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశం ఉందన్నారు.
బల్లకట్టు ఏర్పాటుకు చర్యలు..
గోదావరి నదిలో జరిగే అన్ని కార్యక్రమాలకు(తెప్పోత్సవం, ఏరు ఫెస్టివల్, వినాయక, దుర్గామాత విగ్రహాల నిమజ్జనం) ఉపయోగపడేలా బల్లకట్టు ఏర్పాటుకు మత్స్యశాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇక కరకట్ట వద్ద అనధికార డంపింగ్ యార్డులో వేసే చెత్తతో గోదావరి నీరు కలుషితం అవుతోందని అన్నారు. రోడ్డుపైన, అనధికార డంపింగ్ యార్డులో చెత్త, బయోవేస్ట్ డంప్ చేసేవారికి జరిమానా విధించాలని, అయినా తీరు మారకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ ఈఓ శ్రీనివాసరావును ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ సయ్యద్ అహ్మద్ జానీ, డీఈఈ మధుసూదన్, జేఈ వెంకటేష్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మత్స్యశాఖ అధికారి ఇంతియాజ్, టౌన్ సీఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలంటౌన్: గిరిజనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా అర్హులకే అందాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆది కర్మయోగి అభియాన్ పథకం అమలులో భాగంగా ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహిస్తున్న శిక్షణను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో గ్రామ సభలు నిర్వహించాలని, పథకాలపై గిరిజనులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. గ్రామాలు, వ్యవసాయ క్షేత్రాల్లో మునగ, ఇప్ప, ఇతర చెట్లు నాటించాలని, వాటి ద్వారా కలిగే లాభాలను వివరించాలని అన్నారు. అనంతరం మూడు రోజుల శిక్షణ పూర్తయిన సభ్యులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో పీఓ రాహుల్, ఏపీఓ డేవిడ్‌రాజ్, ఏఓ సున్నం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్.వి.పాటిల్