
కమనీయం.. రామయ్య కల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణ ధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, వృద్ధులు, దివ్యాంగ భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ఎన్.వైష్టవి రెండు వీల్ చైర్లను ఆలయ ఈఓ దామోదరరావుకు వితరణగా అందించారు. కార్యక్రమంలో ఏఈవో శ్రవణ్ కుమార్, పీఆర్వో సాయిబాబు పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్: మండలంలోని కేశవాపురం – జగన్నాథపురం మధ్య కొలువైన శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారికి అర్చకులు 108 సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించాక హారతి, మంత్రపుష్పం, నివేదన సమర్పించారు. ఈఓ రజనీకుమారి, పాలకమండలి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, అర్చకులు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్‌శర్మ పాల్గొన్నారు. కాగా, ఈనెల 7న పెద్దమ్మతల్లి ఆలయంలో చండీహోమం నిర్వహిస్తున్నట్లు ఈఓ తెలిపారు. పాల్గొనే భక్తులు రూ.2,516 చెల్లించి గోత్ర నామాలు నమోదు చేసుకోవాలని, వివరాలకు 63034 08458 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
ఆర్టీసీ డిపో మేనేజర్లు బదిలీ
ఖమ్మంమయూరిసెంటర్: ఆర్టీసీ వ్యాప్తంగా పలువురు డిపో మేనేజర్లను బదిలీ చేస్తూ యాజమాన్యం గురువారం ఉత్తుర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో ఖమ్మం రీజియన్‌లోని ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం డిపోల మేనేజర్లు ఉన్నారు. ఖమ్మం డిపో మేనేజర్ దినేష్‌కుమార్ కామారెడ్డి డీఎంగా, మహబూబాబాద్ డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్ ఖమ్మం డీఎంగా, సత్తుపల్లి డీఎం యూ.రాజ్య లక్ష్మి కొత్తగూడెం డీఎంగా, నల్లగొండ డిపో సీఐ వి.సునీత పదోన్నతిపై సత్తుపల్లి డీఎంగా బదిలీ అయ్యారు. అలాగే, కొత్తగూడెం డీఎం ఎం.దేవేందర్ గౌడ్‌ను వనపర్తికి, భద్రాచలం డిపో మేనేజర్ బి.తిరుపతి హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో లా విభాగానికి బదిలీ కాగా, మహబూబ్‌నగర్ డిపో అసిస్టెంట్ మేనేజర్(మెకానికల్) పి.జంగయ్య పదోన్నతిపై భద్రాచలం డీఎంగా రానున్నారు. వీరంతా వారంలోగా కొత్త స్థానాల్లో చేరనున్నారు.
గోదావరి తగ్గుముఖం
భద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం గురువారం తగ్గుముఖం పట్టింది. గురువారం తెల్లవారుజాము వరకు 44 అడుగులకు చేరుకున్న నీటిమట్టం ఉదయం 8 గంటల వరకు నిలకడగా ఉంది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ సాయంత్రం 4.51 గంటలకు 42.90 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. రాత్రి 9 గంటలకు 42 అడుగులకు చేరగా.. ఎగువ ప్రాంతాల నుంచి వరద రాకపోవడంతో నీటిమట్టం మరింతగా తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
కిన్నెరసాని నుంచి
నీటి విడుదల
పాల్వంచరూరల్ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కిన్నెరసాని జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. గురువారం ఎగువ 1,500 క్యూసెక్కుల నీరు రావడంతో ఒక గేటు ఎత్తి 3వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. నది దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఽప్రాజెక్టు ఇంజనీర్ కోరారు.

కమనీయం.. రామయ్య కల్యాణం

కమనీయం.. రామయ్య కల్యాణం