
కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు..
భద్రాచలంఅర్బన్ : భద్రాచలం గోదావరి నదిలో వినాయక నిమజ్జనాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి 8 గంటల వరకు 315 విగ్రహాల నిమజ్జనం పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం నుంచి మరింతగా పెరిగే అవకాశం ఉందని, ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
గణపతి లడ్డూ @ రూ.లక్ష
దమ్మపేట : మండలంలోని మొద్దులగూడెం వినాయకుడి మండపం వద్ద గురువారం లడ్డూ వేలం నిర్వహించగా గ్రామానికి చెందిన బాల వెంకటేశ్వరరావు రూ.లక్షకు కై వసం చేసుకున్నారు. ఈ మేరకు ఉత్సవ కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావుతో పాటు కుటుంబసభ్యులు ముకుందం, శ్రీనివాసరావు, రవికి లడ్డూ అందజేశారు.
వ్యవసాయ క్షేత్రాల్లో
ట్రెయినీ కలెక్టర్
టేకులపల్లి: మండలంలోని బేతంపూడిలో గల వ్యవసాయ క్షేత్రాలను ట్రెయినీ కలెక్టర్ సౌరభ్‌శర్మ గురువారం పరిశీలించారు. వరి, మొక్కజొన్న, మిర్చి, టమాట పంటలను సందర్శించి రైతులతో మాట్లాడారు. పంటలకు పెట్టుబడి ఖర్చు ఎంత అవుతుంది, ఎంత ఆదాయం వస్తుందనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన నీటికుంటల తవ్వకం, చేపల పెంపకంపై అవగాహన కల్పించారు. ఆయన వెంట ఏఓ నీరుడు అన్నపూర్ణ, ఏఈఓలు శ్రావణి, విశాల ఉన్నారు.
సహకార కార్యదర్శుల బదిలీలపై స్టే
ఖమ్మంవ్యవసాయం: డీసీసీబీ పరిధి పీఏసీఎస్‌ల కార్యదర్శుల బదిలీపై హైకోర్టు స్టే ఇచ్చింది. బదిలీలపై పలువురు హైకోర్టును ఆశ్రయించగా ప్రస్తుత స్థానాల్లో కొనసాగించాలని గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా డీసీసీబీల పరిధిలో కార్యదర్శులను బదిలీ చేయగా, ఖమ్మం డీసీసీబీ పరిధిలో 69మందికి స్థానచలనం కల్పించారు. దీనిపై రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, వరంగల్, నల్లగొండతో పాటు ఖమ్మం కార్యదర్శులు 35మంది కోర్టును ఆశ్రయించటంతో స్టే వచ్చింది. ఫలితంగా మొత్తం కార్యదర్శుల బదిలీ ప్రక్రియ ఆగిపోయినట్లేనని భావిస్తున్నారు. ఈ అంశంపై డీసీసీబీ సీఈఓ ఎన్.వెంకట ఆదిత్యను గురువారం కలిసి బదిలీల్లో మార్పు చేయాలని కోరారు. అయితే, కేసు విరమించుకుంటే పునఃపరిశీలనకు అవకాశముందని తెలుస్తోంది.

కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు..