
సీఎం పర్యటనకు సర్వం సిద్ధం
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
ఏర్పాట్లను పరిశీలించిన
మంత్రి పొంగులేటి
చండ్రుగొండ/అశ్వారావుపేట : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటనకు సర్వం సిద్ధమైంది. వరుసగా రెండుసార్లు వాయిదా పడిన సీఎం పర్యటన ఎట్టకేలకు బుధవారం ఖరారైంది. నేడు మధ్యాహ్నం 2.20 గంటలకు చండ్రుగొండ మండలంలోని బెండాలపాడుకు చేరుకుని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించనున్నారు. కాగా, సీఎం పర్యటన ఏర్పాట్లను రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూర్తిగా మారుమూల గిరిజన గ్రామమైన బెండాలపాడులోనే ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని, ఇందిరమ్మ ప్రజాపాలనకు ఇదే నిదర్శనమని అన్నారు. సీఎం పర్యటనను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వరుసగా వర్షాలు కురుస్తున్నా అధికారులు సభ ఏర్పాట్లను సమర్థంగా పూర్తి చేశారని అభినందించారు. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో పేదోళ్లకు ఒక్క ఇల్లు కూడా రాలేదని, డబుల్ బెడ్‌రూం ఇళ్ల పేరిట ప్రజాధనం దోపిడి చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో తొలివిడతగా రాష్ట్రంలో 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, అందులో 2.90 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. బిల్లుల చెల్లింపులోనూ పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని, ఎక్కడైనా తప్పులు జరిగితే ఏసీబీ విచారణకు అప్పగించామని చెప్పారు. సభలో ముఖ్యమంత్రి రేంవత్‌రెడ్డితోపాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొంటారని వివరించారు. కార్యక్రమంలో అశ్వారావుపేట, భద్రాచలం, ఇల్లెందు ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావ్, కోరం కనకయ్య, ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, గృహనిర్మాణ శాఖ ఎండీ గౌతమ్, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ట్రెయినీ కలెక్టర్ సౌరభ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
అంతా బురదమయం..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన ఇప్పటికి రెండుసార్లు వాయిదా పడినా.. సభా ప్రాంగణం వద్ద పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. టెంట్ల కింద వరదనీరు నిలిచిపోయి ఉంది. మరి సీఎం వచ్చే సమయానికై నా బురద నీటిని తొలగిస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తూ సీఎం వస్తున్నా.. అధికారుల్లో నిర్లక్ష్యం వీడలేదన్నట్టుగానే అసంపూర్తి పనులు దర్శనమిస్తున్నాయి. చండ్రుగొండలో జాతీయ రహదారి వెంట పోగేసిన చెత్త కుప్పలు అలాగే వదిలేయడం గమనార్హం.
కొత్తగూడెంఅర్బన్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కార్యక్రమ విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సభా ప్రాంగణంలో తాగునీరు, వైద్య సహాయం, భద్రత ఏర్పాట్లు చేయాలని, మధ్యాహ్నం 12 గంటలలోపే బస్సులు సభా ప్రాంగణానికి చేరుకునేలా ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ప్రతీ బస్సుకు ఒక ఇన్‌చార్జ్‌ను నియమించాలన్నారు.

సీఎం పర్యటనకు సర్వం సిద్ధం