
సారూ.. ఇటు చూడరూ
మూడేళ్ల క్రితం ప్రారంభమైన సత్తుపల్లి – పెద్దపల్లి రైల్వే లైన్
ఈ లైన్‌లో జోరుగా బొగ్గు రవాణా
రూ.కోట్లు ఆర్జిస్తున్న రైల్వే శాఖ
సత్తుపల్లి టు పెద్దపల్లి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చండ్రుగొండ నుంచి బెండాలపాడుకు రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు. మధ్యలో సత్తుపల్లి – భద్రాచలం రోడ్డు రైల్వే లైన్‌ను క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఈ మార్గం మూడేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చినా ఇప్పటి వరకు కేవలం గూడ్సు రైళ్లకే పరిమితమైంది. ప్రయాణికుల రైళ్లు నడిపేందుకు మాత్రం రైల్వేశాఖ ప్రయత్నించడం లేదు. కనీసం ఈ మార్గంలో బుధవారం ప్రయాణించే ప్రజాప్రతినిధులైనా ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
మూడేళ్లుగా గూడ్సులే..
సత్తుపల్లి – భద్రాచలం రోడ్డు రైల్వేలైను నిర్మాణ వ్యయం రూ.928 కోట్లు కాగా ఇందులో రూ.619 కోట్లు సింగరేణి సంస్థ సమకూర్చింది. ట్రాక్ నిడివి 54 కిలోమీటర్లు ఉండగా ఈ మార్గంలో సర్వారం, చండ్రుగొండ, పార్థసారధిపురం (సత్తుపల్లి) స్టేషన్లు నిర్మించారు. ఈ లైన్ 2022 నవంబర్‌లో జాతికి అంకితమైంది. అంతకుముందే 2022 మే 28 నుంచే గూడ్సు రైళ్ల ద్వారా బొగ్గు రవాణాకు అనుమతి ఇచ్చారు. ఈ లైన్ ద్వారా నిత్యం 30 వేల టన్నుల బొగ్గు రవాణా జరుగుతోంది. వార్షిక రవాణా సామర్థ్యం పది మిలియన్ టన్నులుగా ఉంది. ఈ లైనులో సరుకు రవాణా ద్వారా రైల్వేకు సాలీనా రూ.200 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది.
సేఫ్టీ సర్టిఫికెట్ వచ్చాకే..
నిర్మాణ వ్యయంలో సింహభాగం సింగరేణి నుంచి తీసుకోవడం, ఆ సంస్థ బొగ్గు రవాణా చేస్తూ లాభాలు ఆర్జించడం తప్పితే సింగరేణి కార్మికులు, స్థానిక గిరిజనుల రవాణా అవసరాలు తీర్చడంపై మాత్రం రైల్వేశాఖ దృష్టి సారించడం లేదు. నిబంధనల ప్రకారం ఏదైనా కొత్త లైన్‌లో కొన్నాళ్ల పాటు గూడ్స్ రైళ్లు నడిచిన తర్వాత ప్యాసింజర్ రైళ్లు నడిపే ప్రక్రియ మొదలవుతుంది. అందులో భాగంగా ఈ ట్రాక్‌పై ప్యాసింజర్ రైళ్లను కొంత కాలం పాటు ప్రయోగాత్మకంగా నడిపించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ప్యాసింజర్ రైళ్లు ఎన్ని బోగీలతో, ఎంత వేగంతో నడిపించవచ్చు, ఎక్కడ వేగాన్ని తగ్గించాలి, ఎక్కడ పెంచాలి తదితర అంశాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత ప్రయాణికుల రైళ్లకు ట్రాక్ అనుకూలంగా ఉందా లేదా అని అంచనా వేసి తగు మార్పులు చేస్తారు. ఆ తర్వాత సేఫ్టీ సర్టిఫికెట్ కోసం రైల్వే బోర్డుకు దరఖాస్తు చేస్తారు. అక్కడి నుంచి అనుమతులు వచ్చాక ప్రయాణికుల రైళ్లు పట్టాలెక్కుతాయి. అయితే ఈ మార్గంలో గూడ్సు రైళ్లు దాదాపు మూడేళ్లుగా తిరుగుతున్నా ఇప్పటి వరకు ప్రయాణికుల రైళ్లు నడిపించేందుకు సేఫ్టీ సర్టిఫికెట్ కోసం ప్రయత్నాలు జరగడం లేదు. ఫలితంగా కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్లు అలంకార ప్రాయంగా మారాయి.
ప్రయాణికుల రైలు ఏర్పాటుపై మాత్రం నిర్లక్ష్యమే..
బొగ్గు గనులకు పుట్టిళ్లుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పేరుంది. అలాగే పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్, ఆ పొరుగునే ఉన్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్‌లో సుమారు 30 వేల మంది సింగరేణి కార్మికులు పని చేస్తున్నారు. సత్తుపల్లి, కొత్తగూడెం ప్రాంతాలను పెద్దపల్లి – మంచిర్యాల జిల్లాలతో అనుసంధానం చేసేలా సత్తుపల్లి నుంచి పెద్దపల్లి లేదా బెల్లంపల్లి వరకు పగటి వేళ పుష్‌పుల్ రైలు నడిపించాలని నాలుగు జిల్లాల ప్రజలు కోరుతున్నారు. గతంలో మణుగూరు నుంచి కాజీపేట వరకు ఉదయం వేళ ప్యాసింజర్ రైలు ఉండేది. పెద్దపల్లి నుంచి విజయవాడ వరకు మరో బై వీక్లీ ప్యాసింజర్ రైలు అందుబాటులో ఉండేది. కరోనా సమయంలో ఈ రెండు రైళ్లు రద్దవగా ఇప్పటికీ పునరుద్ధరించలేదు. కనీసం ఈ రైళ్లకు ప్రత్యామ్నాయంగానైనా సత్తుపల్లి – పెద్దపల్లి మధ్య రైలు నడిపించాలని, ఆ మేరకు ప్రజాప్రతినిధులు రైల్వేశాఖపై ఒత్తిడి తేవాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు.