
పల్లె ఓటర్లు @ 6,69,048
● ఎట్టకేలకు లెక్క తేల్చిన అధికారులు ● జిల్లాలో తుది ఓటరు జాబితా ప్రచురణ ● గతం కంటే 45,101 మంది ఓటర్లు అధికం
చుంచుపల్లి: జిల్లాలోని పల్లె ఓటర్ల లెక్క 6,69,048గా తేలింది. గ్రామపంచాయతీలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వార్డుల వారీగా తయారుచేసిన తుది ఓటరు జాబితాను పంచాయతీ అధికారులు మంగళవారం ప్రకటించారు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రధాన అంకం మొదలైంది. దాదాపు తొమ్మిది నెలల తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇటీవల మరోసారి మార్పులు, చేర్పుల అనంతరం తుది ఓటర్ల జాబితాను ప్రచురించారు. ఈ క్రమంలో గత నెల 28న మొదట ముసాయిదా జాబితాలు ప్రచురించాక మండల, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించారు. అలాగే అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించారు.
మహిళలే అధికం..
జిల్లాలోని 471 గ్రామ పంచాయతీల పరిధి లోని 4,168 వార్డులకు సంబంధించిన జాబితాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 6,69,048 మంది ఓటర్లు ఉన్నట్లు తేల్చారు. ఇటీవల పంచాయతీల వారీగా చేపట్టిన ఓటర్ల జాబితా సవరణతో పోల్చితే తాజా జాబితాలో 45,101 మంది ఓటర్లు పెరిగారు. మొత్తం ఓటర్లలో పురుషులు 3,25,045 మంది, మహిళలు 3,43,979 మంది, ఇతరులు 24 మంది ఉన్నారు. పురుషుల కంటే 18,934 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో తుది ఓటరు జాబితాలను అందుబాటులో ఉంచారు. ఎక్కువ శాతం గిరిజన జనాభా ఉన్న పంచాయతీల్లో ఎస్టీలకే సర్పంచ్, వార్డు స్థానాల్లో రిజర్వేషన్ కల్పించనున్నారు. పంచాయతీ ఓటర్ల తుది జాబితా సిద్ధం కావడంతో ఇక గ్రామాల్లో రాజకీయాలు వేడెక్కనున్నాయి.

పల్లె ఓటర్లు @ 6,69,048