
వణికిస్తున్న జ్వరాలు..
ఆస్పత్రులకు పరుగుతీస్తున్న ప్రజలు
చికిత్స, మందుల కోసం
రూ.వేలల్లో ఖర్చు
ముందుజాగ్రత్తలు తప్పనిసరి
మా దృష్టికి వస్తే చర్యలు..
భద్రాచలంఅర్బన్: జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలాయి. ఇటీవల వైరల్ జ్వరాలు, టైఫాయిడ్, చికున్ గున్యా, డెంగీ తదితర వ్యాధులతో ప్రతీ ఇంట్లో ఇబ్బంది పడ్డారు. అయితే జిల్లాలో వైరల్ ఫీవర్లే ఎక్కువగా వ్యాప్తి చెందినా పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ బూచి చూపుతూ అడ్డగోలుగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక పరిసరాలు పరిశుభ్రంగా ఉంచకపోవడం, ఖాళీ స్థలాల యజమానులు వాటిలో పేరుకుపోయిన చెత్త, పిచ్చిమొక్కలు, నీటి నిల్వలు తొలగించకపోవడంతో దోమకాటు ద్వారా వచ్చే వ్యాధులు ఎక్కువగా నమోదవుతున్నాయి. వీటిలో మలేరియా, డెంగీ కేసులు అధికం కాగా, ఎక్కువగా చిన్నారులే ఈ వ్యాధి బారిన పడుతున్నారు.
పెరుగుతున్న కేసులు..
జిల్లాలో వైరల్ జ్వరాలు, చికున్ గున్యా, టైపాయిడ్, డెంగీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రెండు నెలల్లో పలు మండలాలు, గ్రామాల్లో పదుల సంఖ్యలో డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 70 డెంగీ, 54 మలేరియా, ఒక చికున్ గున్యా, 130 టైఫాయిడ్, 29,595 వైరల్ జ్వరాల కేసులు నమోదయ్యాయి. కాగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరుతున్న వారి వివరాలు నమోదు చేస్తుండగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరే వారి లెక్కలు తేలడం లేదు. ఆయా యాజమాన్యాలు జ్వర బాధితుల వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా వైద్యారోగ్య శాఖకు అందించకపోవడంతో జ్వరపీడితుల సంఖ్య స్పష్టంగా తెలియడం లేదు.
పర్యవేక్షణ లోపం..
జ్వరంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగానే డెంగీ, ఇతర పరీక్షల పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ. 40 నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్రతీరోజు ఒక్కో ఆస్పత్రికి 40 నుంచి 80 మందికి పైగా జ్వరంతో వస్తుండగా వారిలో ఆరు నుంచి 10 మందిని అడ్మిట్ చేసుకుంటున్నారు. అంతేకాక నిబంధనలకు విరుద్ధంగా థైరాయిడ్, డెంగీ, టైఫాయిడ్, మలేరియా తదితర టెస్టులు చేసి ఇష్టారాజ్యంగా డబ్బు వసూలు చేస్తున్నారు. డెంగీ కోసం ప్రత్యేకంగా ఎన్‌ఎస్–1, ఎలీసా టెస్ట్ చేయాల్సి ఉండగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం కేవలం ఎన్‌ఎస్–1 టెస్ట్ చేసి డెంగీ సోకిందంటూ ఆస్పత్రిలో చేర్చుకుంటున్నారు. డెంగీ రాకున్నా వచ్చినట్లు చూపించి ప్లేట్‌లెట్స్ (రక్త కణాలు) తగ్గాయంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరిని నాలుగు రోజుల నుంచి ఆరు రోజుల వరకు ఆస్పత్రిలో ఉంచి రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నారు.
జిల్లాలో విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు
వర్షాలు కురుస్తున్నందున వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. జబ్బుల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు వృద్ధి చెందకుండా ఉండాలి. పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ముందస్తు జాగ్రత్తలతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం. జ్వర లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందాలి. పరిశుభ్రమైన వేడి ఆహారాన్నే తీసుకోవాలి.
– డాక్టర్ జయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ
ప్రైవేట్ ఆస్పత్రుల్లో, ల్యాబ్‌ల్లో ఎన్‌ఎస్–1 టెస్ట్ మాత్రమే చేసి డెంగీ అని నిర్ధారించరాదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలీసా టెస్ట్ చేశాక అందులో పాజిటివ్ వస్తేనే డెంగీ ఉన్నట్టు. అంతే తప్ప ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇష్టారాజ్యంగా టెస్ట్‌లు చేసి అడ్మిట్ చేసుకోవద్దు. ఇలాంటివి మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ చైతన్య,
డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, భద్రాచలం

వణికిస్తున్న జ్వరాలు..

వణికిస్తున్న జ్వరాలు..

వణికిస్తున్న జ్వరాలు..