
నిలకడగా గోదావరి
భద్రాచలంఅర్బన్: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శుక్రవారం ఒక్కసారిగా పెరిగి రాత్రి 11 గంటలకు 44.70 అడుగులకు చేరుకుంది. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు 46.10 అడుగులు ఉండగా.. ఉదయం 6 గంటలకు 46.50, 9 గంటలకు 46.90, 11 గంటలకు 47.10 అడుగులుగా నమోదైంది. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు 47.30, 3 నుంచి రాత్రి 7 గంటల వరకు 47.40 అడుగుల వద్ద నిలకడగా ప్రవహించింది. 8 గంటలకు స్వల్పంగా పెరిగి 47.50 అడుగులకు చేరుకుంది. ఆదివారం ఉదయం వరకు నిలకడగా ఉండి, మధ్యాహ్నం నుంచి నెమ్మదిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం. ఎగువ ప్రాంతాల్లో భారీగానే నీరు ఉన్నప్పటికీ ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో డ్యామ్‌ల వద్ద గేట్లు మూసి ఉంచారు. రానున్న రెండు, మూడు రోజుల్లో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
అప్రమత్తం చేసిన అధికారులు..
భద్రాచలం వద్ద శుక్రవారం రాత్రి 7:22 నిమిషాలకు గోదావరి నీటిమట్టం 43 అడుగులు దాటడంతో అధి కారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే నది ఒడ్డున ఉన్న స్లూయీస్‌ల వద్ద భారీ మోటార్లను సిద్ధం చేసి ఉంచారు. అలాగే, వరద ప్రభావిత ప్రాంత ప్రజల కోసం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం, ఐటీడీఏ కార్యాలయంతో పాటు కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి వరద నీరు చేరే అవకాశం ఉంటే ముందస్తుగా సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు.