అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
మణుగూరు టౌన్: వ్యసనాలకు బానిసై చోరీలను అలవాటుగా మార్చుకున్న అంతర్రాష్ట్ర దొంగను మణుగూరు పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ రవీంద్రరెడ్డి కథనం ప్రకారం.. ఈ నెల 23న మణుగూరు అంబేద్కర్ సెంటర్‌లోని శ్రీవారి జ్యూయలరీలో 13 తులాల బంగారం చోరీ జరిగింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం ఎస్‌ఐ ప్రసాద్ తన సిబ్బందితో హనుమాన్ టెంపుల్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పోలీసులను గమనించి పారిపోయేందుకు ప్రయత్నించగా అదుపులోకి తీసుకుని విచారించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భీమవరానికి చెందిన గొర్రెల సత్యనారాయణ ఆరు బంగారు చైన్లు, నల్లపూసల గొలుసు, చిన్న పిల్లల రింగులు 5 మొత్తం 132 గ్రాముల బంగారం అపహరించినట్లు అంగీకరించాడు. వరంగల్, తిరుపతి, కర్నూలు ప్రాంతాల్లో కూడా చోరీలు చేసినట్లు విచారణలో తేలింది. గతంలో అతనిపై సుమారు 30 కేసులు ఉన్నాయి. నిందితుడిని బుధవారం మణుగూరు కోర్టులో హాజరుపర్చినట్లు డీఎస్పీ తెలిపారు.
చోరీలు ఇలా...
మంగళ, శుక్రవారాల్లో బంగారం దుకాణాల యజమానులు పూజలు నిర్వహిస్తుంటారు. ఆ సయమంలోనే సత్యనారాయణ రెక్కీ నిర్వహిస్తూ, కొనుగోళ్లు చేసినట్లు ఏమార్చి షో కేస్‌లో ఉన్న బంగారం అపహరిస్తుంటాడని పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన ఇన్‌చార్జి సీఐ వెంకటేశ్వర్లు, మణుగూరు ఎస్‌ఐ మేడ ప్రసాద్, సీసీఎస్ ఎస్‌ఐ రామారావు, కానిస్టేబుల్ రామారావు, వెంకటనారాయణ, విజయ్‌లను డీఎస్పీ రవీంద్రరెడ్డి అభినందిస్తూ నగదు రివార్డును అందజేశారు.
132 గ్రాముల బంగారం స్వాధీనం


