తెలుగు మాధుర్యాన్ని పిల్లలకు అందించండి
కొత్తగూడెంఅర్బన్: తెలుగు భాష మాధుర్యాన్ని పిల్లలకు అందించి, మాతృభాషపై మక్కువ పెంచాల్సిన బాధ్యత తెలుగు ఉపాధ్యాయులపై ఉందని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ.నాగరాజశేఖర్ అన్నారు. జిల్లాలోని తెలుగు ఉపాధ్యాయులకు కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో జరుగుతున్న చివరి విడత వృత్యంతర శిక్షణ శిబిరాన్ని సందర్శించిన ఆయన మాట్లాడారు. ప్రస్తుత ఆంగ్ల మాధ్యమ ఒరవడిలో తెలుగు భాష కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, దీనిని సమర్థవంతంగా ఎదుర్కొని, కథలు రాయటం, కథలు చెప్పటం, పద్యాలు రాయటం, పద్య పఠనం, ఇంకా అనేక ప్రక్రియలను పరిచయం చేసి పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాల్సిన బాధ్యత తెలుగు ఉపాధ్యాయులదేనని గుర్తు చేశారు. కేవలం పబ్లిక్ పరీక్షల్లో పిల్లలు ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పనిచేయకుండా తెలుగు సాహిత్యం, తెలుగుకు సంబంధించిన వివిధ గ్రంథాలను చదివేటట్లుగా ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో శిక్షణ కేంద్ర ఇన్‌చార్జ్ బి.నీరజ, రాష్ట్ర పరిశీలకులు మడత భాస్కర్‌గౌడ్, డీఆర్పీలు రంగపురి కృష్ణార్జున్‌రావు, బండి రామచందర్‌రావు, సత్య సాయిరాం, భూక్య కర్ణ పాల్గొన్నారు.


