విద్యుదాఘాతంతో యువకుడి మృతి
ములకలపల్లి: ఇంట్లో వేలాడే విత్యుత్ తీగలు ఆ యువకుడి పాలిట యమపాశాలయ్యాయి. ఆరేసిన బట్టలు తీసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని వీకే రామవరంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజశేఖర్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన కొర్సా శ్రీను పద్మ దంపతుల చిన్న కుమారుడు అరవింద్ (14).. స్నానం చేసి, ఇంట్లో దండేనికి ఆరేసిన బట్టలు తీస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
అటవీ సిబ్బందిని అడ్డుకున్న పోడురైతులు
ఇల్లెందురూరల్: మండలంలోని మర్రిగూడెం గ్రామపంచాయతీ ఎల్లాపురం గ్రామంలో అటవీశాఖ సిబ్బందిని పోడురైతులు శనివారం అడ్డుకున్నారు. రైతులు తమ చేలల్లో విద్యుత్ సౌకర్యం కోసం పనులు చేయడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి బయలుదేరగా ఎల్లాపురం సమీపంలోనే పోడు రైతులు అడ్డుకున్నారు. పోడు భూములకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, ఉన్నతాధికారుల అనుమతితోనే తాము విద్యుత్ స్తంభాలు పాతేందుకు పనులు చేపట్టామని తెలిపారు. దీంతో అటవీశాఖ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
బాలిక అదృశ్యంపై కేసు
భద్రాచలంఅర్బన్: బాలిక కనిపించకుండా పోయిన ఘటనపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలోని ఆదర్శనగర్‌కాలనీకి చెందిన చిలకల లక్ష్మి, ఆదినారాయణకు 15 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి బాబు, పాప సంతానం. కాగా ఈ నెల 22న అర్ధరాత్రి లక్ష్మి నిద్ర లేచిచూడగా ఇంట్లో కూతురు కనిపించకలేదు. ఎక్కడా ఆచూకీ దొరక్కపోవడంతో శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లక్ష్మి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
చోరీ ఘటనపై..
భద్రాచలంఅర్బన్: బంగారు ఆభరణాల చోరీపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. భద్రాచలం పట్టణంలోని గోల్డ్‌స్మిత్‌కాలనీకి చెందిన మహిళ అంజు పాల్ ఈ నెల 22న హనుమాన్ జయంతి సందర్భంగా తన స్నేహితులతో కలిసి రామాలయం దర్శనానికి వెళ్లింది. ఈ క్రమంలో ఇంట్లోకి గుర్తుతెలియని దుండగులు ప్రవేశించి, రూ. 56 వేల విలువైన బంగారం చోరీ చేశారని.. అంజుపాల్ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేయగా టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.


