ఇక ఆటలు ఆడుకోవచ్చు..
● భద్రాద్రిలో క్రీడా మైదానం ఏర్పాటుకు అడుగులు ● ఐటీడీఏ పీఓ చొరవతో స్థల సేకరణ ● తీరనున్న క్రీడాకారుల కళ
భద్రాచలంటౌన్: భారత మహిళా క్రికెట్ జట్టులో స్థానం సాధించిన గొంగడి త్రిష భద్రాద్రిలో తొలుత శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే. కానీ, ఇక్కడ క్రీడామైదానం లేకపోవడం క్రీడాకారులకు ఎంతో లోటు. క్రీడాకారులు శిక్షణ పొందాలన్నా.. పోటీలు నిర్వహించాలన్నా.. స్థానికంగా ఉన్న జూనియర్ కళాశాల క్రీడా మైదానమే పెద్ద దిక్కు. ఈ విషయాన్ని స్థానిక క్రీడాకారులు, యువకులు అనేక సార్లు ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా ప్రతిఫలం దక్కలేదు. ఇటీవల ఐటీడీఏ పీఓ పట్టణంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. క్రీడా మైదానానికి కేటాయించేలా సర్వే చేసి పూర్తి నివేదికను అందజేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చి నూతన హంగులతో క్రీడా మైదానం అందుబాటులో రావాలని క్రీడాకారులు ఆకాంక్షిస్తున్నారు.
మెగా టోర్నీలకు వేదికగా..
ఏటా నిర్వహించే భద్రాద్రి కప్‌తో పాటు జాతీయస్థాయిలో నిర్వహించే నెహ్రూకప్‌నకు భద్రాద్రి ఆతిథ్యం ఇస్తోంది. కానీ, సరైన మైదానం లేక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్నే సర్దుకోవాల్సి వస్తోంది. ఐటీడీఏ తరఫున నిర్వహించే క్రీడాపోటీలు సైతం ఇక్కడే నిర్వహిస్తారు. అయితే, ఇదే మైదానాన్ని ఇతర కార్యక్రమాలకు కూడా అద్దెకు ఇవ్వడంతో తిరిగి క్రీడలు నిర్వహించే సమయంలో అసౌకర్యంగా ఉంటోంది. దీంతో క్రీడాకారులు, క్రీడాభిమానుల ఏళ్లుగా విన్నవిస్తున్నా కార్యరూపం దాల్చలేదు.
ఐదెకరాల్లో ప్రణాళిక
పట్టణంలోని సుందరయ్యనగర్ కాలనీలో ఉన్న 5 ఎకరాల్లో స్టేడియం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ భూమి క్రీడా మైదానానికి కేటాయించేలా ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను పీఓ రాహుల్ ఆదేశించారు. ఆయనే స్వయంగా వెళ్లి సదరు ప్రాంతాన్ని రెవెన్యూ అధికారలతో కలిసి పరిశీలించారు. కాగా, ఈ భూమి గతంలో పంచాయతీకి అప్పగించారు. ప్రస్తుతం ఈ భూమిని మైదానం ఏర్పాటుకు కేటాయించారు కాబట్టి తిరిగి పంచాయతీ అధికారుల నుంచి తీసుకోవాలి. ఈ ప్రక్రియను వేగంగా పూర్తయితే స్టేడియం పనులకు అడుగులు పడతాయి.
యువతను ప్రోత్సహించేందుకే..
భద్రాచలంలో క్రీడలపై ఆసక్తి ఉన్న యువతను ప్రొత్సహించేందుకే స్టేడియం ఏర్పాటు చేయాలనుకున్నాం. ఆటలు ఆడుకోవడానికి సరైన క్రీడా ప్రాంగణాలు లేవు. సుందరయ్యనగర్‌లో ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ భూమినిలో స్టేడియం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించాను.
–బి.రాహుల్, ఐటీడీఏ పీఓ, భద్రాచలం
సరైన మైదానం లేక ఇబ్బందులు
భద్రాచలం పట్టణంలో ఏళ్లుగా సరైన క్రీడా మైదానం లేదు. ప్రతీ సారి ఇక్కడి క్రీడాకారులు జానియర్ కళాశాల క్రీడా మైదానంలోనే పోటీలతో పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పూర్తిస్థాయి మైదానం ఏర్పాటుకు అడుగులు పడడం శుభ పరిణామం.
–నగేశ్, భద్రాచలం
మైదానం అవసరం ఉంది
భద్రాచలం పట్టణంతో పాటు సరిహద్దు మండలాల క్రీడాకారులు ప్రాక్టీస్ చేయడానికి పూర్తిస్థాయి వసతులతో క్రీడా మైదానం అవసరం ఉంది. అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పుడు పీఓ స్టేడియం ఏర్పాటుకు చొరవ తీసుకోవడం హర్షనీయం.
–కుప్పాల చరణ్ తేజ, క్రికెట్ కోచ్, భద్రాచలం
ఇక ఆటలు ఆడుకోవచ్చు..
ఇక ఆటలు ఆడుకోవచ్చు..
ఇక ఆటలు ఆడుకోవచ్చు..


