
నాణ్యమైన సేవలు అందించేలా..
● గ్రామ పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ● జిల్లాలో తొలివిడత 40 మందికి అవకాశం
చుంచుపల్లి: పల్లె పాలనలో కార్యదర్శులే కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరు అన్ని అంశాల్లో పరిజ్ఞానం కలిగి ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ఇప్పటికే దీనిపై జిల్లా నుంచి ఒక ఎంపీఓ, సెకండ్ గ్రేడ్ పంచాయతీ కార్యదర్శితో పాటు హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థకు చెందిన మరో ఇద్దరు మాస్టర్ ట్రైనీలు శిక్షణ పొందారు. వారితో గురు, శుక్రవారాల్లో జిల్లాలో ఎంపికై న కొన్ని పంచాయతీల కార్యదర్శులకు ఐడీఓసీలో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి రోజు గురువారం జిల్లా పంచాయతీ అధికారి వి.చంద్రమౌళి పర్యవేక్షణలో కార్యదర్శులకు శిక్షణ ఇచ్చారు. జిల్లాలో 481 గ్రామ పంచాయతీలకు గాను, 455 మంది కార్యదర్శులు పనిచేస్తున్నారు. ఈ శిక్షణ కోసం ప్రతి మండలంలోని మూడు, నాలుగు పంచాయతీలను ఎంపిక చేయగా మొదటి విడతలో 40 మంది కార్యదర్శులకు రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.
ఏయే అంశాలపైన..
తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం గ్రామ సభల ప్రాముఖ్యత, మెరుగైన స్థానిక పాలన కోసం ప్రజల భాగస్వామ్యంతో కూడిన పాలనను ప్రోత్సహించడం, సమాచార హక్కు చట్టం, స్వచ్ఛందంగా సమాచారం వెల్లడించడం ద్వారా పారదర్శకతను ప్రోత్సహించడం, ఎన్నికై న ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక బృందాలు, పౌర సమాజ సంస్థలతో సమన్వయంతో గ్రామ సభలను బలోపేతం చేయడం, మహిళా–స్నేహపూర్వక గ్రామ పంచాయతీలను ప్రోత్సహించడం, మహిళా సాధికారత, బాలల సంరక్షణకు సంబంధించిన ముఖ్యమైన చట్టాలు వంటి అంశాలపై పూర్తిస్థాయిలో కార్యదర్శులకు అవగాహన కల్పించనున్నారు. ప్రజల భాగస్వామ్యంతో కూడిన పాలన ప్రాముఖ్యత, మహిళా గ్రామ సభలు, గ్రామసభ నిర్వహణలో పంచాయతీ కార్యదర్శి పాత్ర, వివిధ శాఖలు, స్వయం సహాయక బృందాలు, స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం చేసుకోవడానికి అవసరమైన వ్యూహాలపై తొలిరోజు గురువారం చర్చించారు.