రైతుల సంక్షేమానికే ‘భూ భారతి’
సుజాతనగర్ : రైతుల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం అమలు చేస్తోందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సుజాతనగర్ మండలాన్ని పైలట్‌ప్రాజెక్ట్‌గా ఎంపిక చేయగా.. గరీభ్‌పేట, బేతంపూడి గ్రామాల్లో సోమవారం కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూ వివాదాల పరిష్కారానికి ఈ చట్టం దోహదం చేస్తుందన్నారు. రైతులకు వారి భూములపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం కొత్త అంశాలను పొందుపరుస్తూ నూతన ఆర్‌ఓఆర్ తెచ్చిందని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని, ప్రతీ దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని వివరించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఈనెల 15 వరకు సదస్సులు నిర్వహించి, రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ మధు, తహసీల్దార్ శిరీష, ఆర్‌లు వీరభద్రం, కాంతారావు పాల్గొన్నారు.
పంటల మార్పిడితో అధిక లాభాలు..
సూపర్‌బజార్(కొత్తగూడెం): పంటల మార్పిడి పద్ధతి అనుసరిస్తే అధిక లాభాలు గడించొచ్చని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. రాబోయే వానాకాలం సాగుకు రైతులను సమాయత్తం చేసేందుకు కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో చుంచుపల్లి మండలం పెనగడపలో సోమవారం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 13 వరకు సదస్సులు కొనసాగుతాయన్నారు. పంటల సాగులో యూరియా వాడకాన్ని తగ్గించాలని, అవసరమైన మేరకే రసాయనిక ఎరువులు వాడుకుని ఖర్చు తగ్గించుకోవాలని సూచించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల వైపు కూడా రైతులు ఆసక్తి చూపాలని అన్నారు. కేవీకే శాస్త్రవేత్తల సేవలను ఉపయోగించుకోవాలని, సాగులో శాసీ్త్రయత పెంపొందించుకుని అధిక లాభాలు పొందాలని కోరారు. కార్యక్రమంలో కేవీకే ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డాక్టర్ వి.లక్ష్మీనారాయణమ్మ, ఉద్యాన శాస్త్రవేత్త బి.శివ, కొత్తగూడెం ఏడీఏ నరసింహారావు, చుంచుపల్లి ఏఓ రాజేశ్వరి, ఏఈఓ మమత పాల్గొన్నారు.
రెవెన్యూ సదస్సుల ప్రారంభంలో కలెక్టర్
పైలట్ ప్రాజెక్ట్‌గా సుజాతనగర్ మండలం


