
మావోయిస్టులతో చర్చలు జరపాలి
సింగరేణి(కొత్తగూడెం): మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివాసీలను హననం చేసే ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని, కర్రిగుట్టను చుట్టుముట్టిన కేంద్ర బలగాలను వెనక్కి రప్పించాలని కోరుతూ సోమవారం పలు రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కొత్తగూడెంలోని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక ఆదివాసీ ఉన్న చట్టాలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. నూతన అటవీ సంరక్షణ నియమాల పేరుతో కొత్తచట్టాలను తీసుకొచ్చి ఆదివాసీల ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తోందన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో 89 రకాల ఖనిజ సంపద ఉందని, వాటిని స్వాధీన పరుచుకోవటం కోసం దాడులు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. 280 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన కర్రి గుట్టను టార్గెట్ చేసుకుని 25 లక్షల సైన్యం జల్లెడ పడుతోందన్నారు. తక్షణమే వీరందరిని వెనక్కి పిలిచి శాంతి చర్చలు జరుపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిద పార్టీల నాయకులు, ప్రజా సంఘా ల నాయకులు పాల్గొన్నారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు